దొండ, ఆలు, ఉల్లిగడ్డలకూ రెక్కలు
పెరిగిన ధరలతో జనం బెంబేలు
కూరగాయల దిగుబడిపై చలి ప్రభావం
తగ్గిన ఉత్పత్తి, పెరిగిన వినియోగంతో ధరలు పైపైకి
రాబోయే రోజుల్లో మరింతగా ధరలు పెరుగుతాయంటున్న మార్కెటింగ్ వర్గాలు
సాక్షి, హైదరాబాద్: వంటింట్లో ధరల మంట పుడుతోంది. కూరగాయల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో కూరగాయలు కొనాలంటే రూ.వంద నోటు తీయాల్సి వస్తోంది. అటు పౌల్ట్రీ రంగంలోనూ ఉత్పత్తి తగ్గడంతో కోడిగుడ్డు సైతం రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. దీంతో హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, ఇతర మార్కెట్లలో కూడా కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంతగా పెరిగిపోయాయి.
కూరగాయల ధరలు కిలోకి రూ. 60–80కి తక్కువగా లేకపోవడం గమనార్హం. గడ్డి అన్నారం, గుడి మల్కాపూర్, బోయినపల్లి మార్కెట్‌లలో రిటైల్ ధరలకు, బహిరంగ మార్కెట్‌లో రిటైల్ ధరలకు కిలోకి రూ.10–20 వరకు తేడా ఉంటోంది. గడ్డి అన్నారం మార్కెట్‌లో టమాటా ధర శనివారం రూ.41 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో, మాల్స్‌లో రూ.60 పలికింది.
బీర, కాకర, సొరకాయ వంటి వాటి ధరలు గడ్డి అన్నారంలో కిలో రూ. 45 ఉంటే బహిరంగ మార్కెట్‌లో రూ.60–70 వరకు విక్రయిస్తున్నారు. కట్ట రూ.10 పలికే పాలకూర, తోటకూరలు ఇప్పుడు రూ. 20–30 పలుకుతున్నాయి. అదే సమయంలో చికెన్, మటన్ ధరలు కూడా పెరిగిపోయాయి. ఆదివారం హైదరాబాద్ రిటైల్ మార్కెట్‌లో చికెన్ ధర కిలో రూ.250, మటన్ రూ.950–1,000 పలుకగా, కోడిగుడ్డు రిటైల్ ధర రూ.8గా ఉంది.
చలి తీవ్రత – దిగుబడిపై ప్రభావం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో దాని ప్రభావం కూరగాయల ఉత్పత్తిపై పడింది. అతి తక్కువ ఉష్ణోగ్రతల వల్ల పూత నిలవకపోవడం, కాయ పెరుగుదల మందగించడం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా తగ్గింది. డిసెంబర్‌లో ఇళ్లల్లో పాదులకు పెరిగే చిక్కుడు, బీరకాయ, కాకరకాయలు వంటివి కూడా చలి తీవ్రతతో దిగుబడి రాలేదని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రానికి కూరగాయలు సరఫరా అయ్యే ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ధరలు పెరిగాయి.
ముఖ్యంగా టమాటా, మిర్చి తోటలు చలి ధాటికి నల్లబారిపోవడంతో మార్కెట్‌కు వచ్చే సరుకు తగ్గిపోయింది. గత సెపె్టంబర్, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు రెండో విడత సాగు చేయడానికి వెనకడుగు వేశారు. ఫలితంగా మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు పైపైకి వెళ్తున్నాయి. తెలంగాణలో కూరగాయల సాగు విస్తీర్ణం 20–30 శాతం తగ్గడంతో ఉత్పత్తి క్షీణించింది. వరి, పత్తి వైపు రైతులు మళ్లడం, ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం మరో కారణం.

కొండెక్కిన కోడిగుడ్డు
పేదల ప్రొటీన్ ఆహారమైన కోడిగుడ్డు ధర కూడా చుక్కలను తాకుతోంది. రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.8కి చేరింది. పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల పెంపకం వ్యయం పెరగడం, గతంలో సోకిన కొన్ని వ్యాధుల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గడం దీనికి ప్రధాన కారణం. చలికాలంలో డిమాండ్ పెరగడం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడంతో కోడిగుడ్డు రేట్లు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో 100 గుడ్ల ధర రూ.670 దాటడం గత కొన్నేళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లోనే 100 గుడ్ల ధర 700కు చేరింది. రిటైల్‌లో రూ. 7.50–8 పలుకుతోంది. కొన్ని పౌల్ట్రీ సంస్థలు అందిస్తున్న విటమిన్ గుడ్ల ధరలు రూ.10–12 వరకు పలుకుతుండగా, నాటుకోడి గుడ్డు ధర రూ.15 పైనే ఉంది.
సంక్రాంతి వరకు ఇంతేనా..?
మార్కెటింగ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, రాబోయే సంక్రాంతి పండుగ వరకు ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. చలి తీవ్రత ఇలాగే కొనసాగితే దిగుబడి మరింత తగ్గి, ధరలు మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లాలంటే భయమేస్తోందని, రూ.500 పట్టుకెళ్తే సంచి కూడా నిండటం లేదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే కూరగాయలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.


