మహిళలను వేధిస్తే కఠిన చర్యలు  

Vasireddy Padma Speech In Guntur Over Women Security - Sakshi

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ 

సాక్షి, నెహ్రూనగర్‌(గుంటూరు):  రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె  మొట్టమొదటిసారిగా గుంటూరు వికాస్‌ నగర్‌లోని మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలపై దాడుల కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించి బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ముఖ్యంగా పురుషుల ఆలోచన విధానం మార్చగలిగితే మహిళలపై దాడులు నివారించవచ్చన్నారు.

ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. మహిళా కమిషన్‌పై మహిళలకు మంచి ఆదరణ కలిగించే విధంగా షెడ్యూల్‌తో కూడిన క్యాలెండర్‌ రూపొందించి దాని ప్రకారం పనిచేస్తామన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించి మహిళల స్థితిగతులను తెలుసుకుని, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వారి అభివృద్ధికి కావాల్సిన సూచనలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. మహిళలపై దాడులు జరగడానికి  సినిమాలు, సీరియల్స్‌ ప్రభావం కూడా ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సినీ ఇండస్ట్రీ ప్రముఖలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి  నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రేమికుల జంటకు అండగా ఉంటాం
కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రాంతానికి చెందిన ఎస్సీ అమ్మాయి, బీసీ అబ్బాయి ప్రేమించి వివాహం చేసుకుంటే వారిని వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఎక్కడా పనిచేసుకోనివ్వకుండా  వేధిస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దగ్గరకు ఓ ప్రేమ జంట వచ్చిందని.. ఆ కేసు విజయమ్మ తనకు అప్పగించారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. విజయమ్మ ఇచ్చిన మొట్టమొదటి కేసును పరిశీలించి వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు ప్రభుత్వపరంగా బాధిత జంటకు అండగా ఉంటామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top