వాట్సాప్‌ హవా.. ఇన్‌స్టాగ్రామ్‌ క్రేజ్‌

Users of WhatsApp And Instagram was increased with Lockdown - Sakshi

లాక్‌డౌన్‌తో అమాంతంగా పెరిగిన యూజర్లు 

నెలకు కొత్తగా 1.50 కోట్ల మంది వాట్సాప్‌ వినియోగం 

టిక్‌టాక్‌పై నిషేధంతో ఇన్‌స్టాగ్రామ్‌కు వెల్లువెత్తుతున్న ఆదరణ 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ దేశంలో సోషల్‌ మీడియా వాడకాన్ని అమాంతం పెంచుతున్నాయి. గతంలో సోషల్‌ మీడియా వేదికలను మిత్రులతో భావాలు పంచుకునేందుకో, సరదా కోసమో ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ లాక్‌డౌన్‌తో బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో విద్య, విజ్ఞాన తదితర వ్యవహారాలకు వీటిని వినియోగించడం ఎక్కువైంది. దీంతో వాట్సాప్‌ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక టిక్‌టాక్‌పై నిషేధంతో యూజర్లు వినోద సాధనంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అధికంగా వాడుతున్నారు. ప్రముఖ మార్కెట్‌ పోర్టల్‌.. ‘స్టాటిస్టా’ నివేదిక ప్రకారం దేశంలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల పెరుగుదల ఇలా ఉంది.. 

నెలకు 1.50 కోట్ల మంది పెరుగుదల 
► వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లుండగా భారత్‌లో 45 కోట్ల మంది యూజర్లున్నారు.  
► కరోనాతో మార్చి, ఏప్రిల్, మేలలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ యూజర్లు నెలకు 5 కోట్ల మంది చొప్పున పెరిగారు. భారత్‌లో ఏప్రిల్, మే, జూన్‌లలో నెలకు 1.50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లు పెరిగారు. 

టిక్‌టాక్‌ పోయే.. ఇన్‌స్టాగ్రామ్‌ వచ్చే.. 
► కేంద్ర ప్రభుత్వం ఇటీవల టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించడం ఇన్‌స్టాగ్రామ్‌కు కలసి వచ్చింది.  
లాక్‌డౌన్‌కు ముందు భారత్‌లో నెలకు దాదాపు 40 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేవారు.  
► కాగా.. లాక్‌డౌన్‌తో మేలో 89 లక్షల మంది, జూన్‌లో 92 లక్షల మంది కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  
► కేంద్రం జూన్‌ 29న టిక్‌టాక్‌ను నిషేధించగానే రంగంలోకి దిగిన ఇన్‌స్టాగ్రామ్‌ 15 సెకన్ల వీడియోలను అప్‌లోడ్‌ చేసే వెసులుబాటు కల్పించింది. దాంతో టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వైపు యూజర్లు మొగ్గు చూపారు.  
► జూన్‌ 29 నుంచి జూలై 12 నాటికి దాదాపు 50 లక్షల మంది కొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top