‘పుర’ నగారా | ura' Press | Sakshi
Sakshi News home page

‘పుర’ నగారా

Mar 4 2014 2:59 AM | Updated on Oct 16 2018 6:35 PM

పురపాలక ఎన్నికల నగారా మోగింది. ఎట్టకేలకు కార్పొరేషన్, మున్సిపాలిటీల పాలకవర్గాల నియామకానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

 కర్నూలు:
 పురపాలక ఎన్నికల నగారా మోగింది. ఎట్టకేలకు కార్పొరేషన్, మున్సిపాలిటీల పాలకవర్గాల నియామకానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పాలకవర్గాల కాల పరిమితి ముగిసి దాదాపు మూడున్నరేళ్లు గడుస్తోంది.

ఈ కారణంగా కర్నూలుతో పాటు ఆయా మున్సిపాలిటీల పరిధిలో ప్రజలు సమస్యలతో సహజీవనం చేయాల్సి వచ్చింది. ప్రజలకు, అధికారులకు మధ్య అనుసంధానకర్తలు లేకపోవడంతో అభివృద్ధి గాడితప్పింది. వివిధ కారణాలతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈనెల 3న హైకోర్టు పురపాలక సంఘాలకు ఎన్నికలు నాలుగు వారాల్లోగా నిర్వహించాలని ఆదేశించడంతో ఆ దిశగా చర్యలు ముమ్మరమయ్యాయి. సోమవారం రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో అప్పటి నుంచే కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.

ఈనెల 30న ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. గెలిచిన అభ్యర్థులు 7న ప్రమాణం స్వీకారం చేయడంతో ప్రక్రియ ముగియనుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికలు తెరపైకి రావడంతో నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగవచ్చని భావిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ మున్సి‘పోల్స్’ను సవాల్‌గా భావిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరింత ఇబ్బందికరంగా మారడంతో నాయకులంతా పక్కచూపులు చూస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పలువురు టీడీపీ వైపు అడుగులేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతోనే నిర్వహిస్తుండటంతో పోటీ రసవత్తరం కానుంది.
 

 పరీక్షల వేళ ఎన్నికలు
 పబ్లిక్ పరీక్షల వేళ ఎన్నికల ముహూర్తం ఖరారు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 13న ఇంటర్మీడియెట్, అదే నెల 27న పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. పరీక్షల సందర్భంగా ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషించాల్సి ఉంది. ఇదే సమయంలో ఎన్నికలు ఉండటం గందరగోళానికి తావిస్తోంది. రెవెన్యూ, ఎన్జీఓలు తగినంత సిబ్బంది లేకపోవడంతో ఎన్నికలకు ఉపాధ్యాయులను వినియోగించుకోక తప్పని పరిస్థితి. పరీక్షల వేళ ఆయా పాఠశాలల్లో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తే విద్యార్థుల భవిష్యత్ ఏమి కావాలనే ప్రశ్న తలెత్తుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement