బాల్యానికి మూడు 'ముల్లు' | Child marriages are high in Kurnool district | Sakshi
Sakshi News home page

బాల్యానికి మూడు 'ముల్లు'

Nov 10 2025 4:56 AM | Updated on Nov 10 2025 4:58 AM

Child marriages are high in Kurnool district

కర్నూలు జిల్లాలో అధికంగా బాల్య వివాహాలు 

పత్తికొండ, ఆదోని డివిజన్‌లలో  అధికం 

దగ్గరి బంధువులకు ఇచ్చుకోవడం, పేదరికం, నిరక్షరాస్యత కారణం 

బాల్యవివాహాలతో అనారోగ్యం 

చిన్నతనంలో గర్భం దాలిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం

కర్నూలు(హాస్పిటల్‌): పేదరికం, నిరక్షరాస్యత, బాలికల ఎదుగుదలపై ఆందోళన, అభద్రతాభావం వంటి కారణాలతో  కర్నూలు జిల్లాలో బాల్యవివాహాలు అధికమవుతున్నాయి. ఇందులో అధికారులు కొన్ని మాత్రమే అడ్డుకుంటుండగా అధిక శాతం గుట్టుచప్పుడు కాకుండా, ఆధార్‌కార్డులో వయస్సు మార్చి వివాహ తంతు జరిపించేస్తున్నారు. వీటిలో అధికశాతం గ్రామ పెద్దల సహకారంతోనే జరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారు. 

బిడ్డకు మూడుముళ్లు పడితే భారం తగ్గిపోతుందన్న భావనతో గ్రామాల్లో కూతురు పుష్పవతి అయితే చాలు ఏ అయ్యకు కట్టబెడదామా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతూ వారి భవిష్యత్‌ నాశనమవుతోంది. మరోవైపు చిన్నవయస్సులో గర్భవతి కావడంతో ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

4,754 మంది బాలికలు తల్లులు 
జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 38,779 మంది గర్భం దాల్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో 19 ఏళ్లలోపు బాలికలు 4,754 మంది ఉన్నారు. వీరిలో కర్నూలు డివిజన్‌లో 10.27శాతం, ఆదోని డివిజన్‌లో 12.75శాతం, పత్తికొండ డివిజన్‌లో అధికంగా 15.04శాతం మంది  గర్భం దాల్చారు. జిల్లాలో 10 నెలల కాలంలో జరిగిన మొత్తం వివాహాల్లో 16 ఏళ్లకు 814 (21.5శాతం), 17 ఏళ్లకు 888(23.6శాతం), 18 ఏళ్లకు 1,237(32.8శాతం), 19 ఏళ్లకు 595(15.8శాతం) వివాహం చేసుకున్నారు. 

19 ఏళ్లకు పైగా కేవలం 236 మంది అమ్మాయిలు మాత్రమే వివాహం చేసుకున్నారు. అది కూడా కర్నూలు నగరంలాంటి చోట్ల మాత్రమే వివాహ వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తున్నారు. గ్రామాల్లో వివాహ వయస్సు చూపించేందుకు అధిక శాతం ఆధార్‌కార్డులో 63.4 శాతం మంది వయస్సును తప్పుగా నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

చదువుకూ అమ్మాయి దూరం 
ఆదోని, పత్తికొండ డివిజన్‌లలో ఆడపిల్లలు ఎక్కువగా చదువుకునేందుకు ఇష్టపడటం లేదు. అమ్మాయిని చదువుకోసం దూరంగా పంపించేందుకు భయపడటం, అభద్రతభావం, సామాజిక పరిస్థితులతో మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. 

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేక 1,614(44.4శాతం) మంది, ఆర్థిక కారణాలతో  1,473(36.6శాతం) మంది, మిగిలిన వారు కుటుంబసమస్యలతో ఏడుగురు, సామాజిక రుగ్మతలతో 105 మంది, తల్లిదండ్రుల ఒత్తిడితో 388 మంది, మరికొందరు ప్రేమవివాహాల కారణంగా బా లికలు మధ్యలోనే చదువు మానేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా జరిగిన వివాహాల్లో అధికంగా 89.1శాతం పెద్దలు కుదుర్చిన వివాహాలు కాగా దాని తర్వాతి స్థానంలో 8.4శాతం మంది తమకు నిచ్చిన వారిని ప్రేమవివాహాలు చేసుకున్నారు. 

కమిటీలు ఉన్నా చర్యలు నామమాత్రమే! 
జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీని అరికట్టేందుకు జిల్లా స్థాయి, డివిజన్‌ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. జిల్లా›స్థాయిలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ కాగా, కన్వినర్‌గా జిల్లా ఎస్పీ, డీఎంహెచ్‌ఓ, సభ్యులుగా గైనకాలజీ హెచ్‌ఓడీ, ఐసీడీఎస్‌ అధికారి, డీఈఓ, ఆర్‌ఐఓ, డివిజన్‌ స్థాయిలో చైర్మన్‌/చైర్‌పర్సన్‌గా ఆర్‌డీఓ, కన్వినర్‌గా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సభ్యులుగా స్థానిక డీఎస్పీ ఉంటారు. ఈ కమిటిలు బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

 పాఠశాలలకు కౌమారదశ బాలికలకు పునరుత్పత్తి ఆరోగ్యం, న్యాయపరమైన హక్కులు, లైఫ్‌ స్కిల్స్‌ గురించి వివరించారు. బాల్యవివాహాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. కౌమార దశ బాలికలకు వచ్చే సమస్యలపై ఆరోగ్యశిబిరాలు నిర్వహించాలి. కానీ అధికారులు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నా చర్యలు కరువయ్యాయి. 

ఆదోని, పత్తికొండ డివిజన్‌లలో అధికం
గర్భం దాల్చే వారిలో నిరక్షరాస్యులైన బాలికలే అధికంగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 10 నెలల్లో నమోదైన గర్భిణుల్లో ఐదవ తరగతి వరకు చదివిన వారు 23.5శాతం, పది ఫెయిలైన వారు 18.8శాతం, 6 లేదా 7వ తరగతి చదివిన వారు 14.7శాతం, 8 లేదా 9వ తరగతి చదివిన వారు 13.8శాతం మంది ఉన్నారు. 

ఆదోని, పత్తికొండ డివిజన్‌లలో అధికంగా అక్షరాస్యత తక్కువగా ఉంటోంది. దీనికి తోడు పేదరికం, వర్షపాతం తక్కువగా ఉండటం, ఫలితంగా పంటలు సరిగ్గా పండకపోవడం, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం, అమ్మాయిల భద్రత గురించి ఆందోళన, సామాజికపరమైన అంశాలు వంటి కారణాలతో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. 

పుష్పవతి అయిన బాలికలను ఒకరికిచ్చి పెళ్లి జరిపిస్తే తమ బాధ్యత తీరిపోతుందని నమ్మే వారు అధికంగా ఉన్నారు. చెడు వ్యసనాల కారణంగా భార్య లేదా భర్త మరణించడంతో ఒంటరివారైన పిల్లల వివాహాలు కూడా త్వరగా జరిపించేస్తున్నారు. ఇందులో అమ్మాయిల అవ్వాతాతలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 

సెప్టెంబర్‌ 15వ తేదీ... 
ఆదోని పట్టణంలోని పట్టణంలోని ఇందిరానగర్‌లో బాల్య వివాహాన్ని టూటౌన్‌ పోలీసులు అడ్డగించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాల్యవివాహాలతో జరిగే నష్టాలను వివరించారు. కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఏం చేయాలి..
అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయరాదు. బాల్య వివాహాలు చేసే వారి గురించి చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, పోలీసు హెల్ప్‌లైన్‌ 100, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చు. 

తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం 
చిన్న వయస్సులో గర్భం దాలిస్తే బాలికకు రక్తహీనత ఏర్పడటం, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అబార్షన్లు జరుగుతాయి. అమ్మాయికి పెల్విన్‌బోరాన్‌ వృద్ధి చెందక ముందే వివాహం చేయడం వల్ల వారికి ప్రసవం కష్టమై సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. బీపీ, ఫిట్స్, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అబార్షన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అవిటితనం ఉన్న పిల్లలు జన్మించే అవకాశం ఉంది.  –డాక్టర్‌ ఎస్‌.సావిత్రి, గైనకాలజీ హెచ్‌వోడీ, కర్నూలు పెద్దాసుపత్రి 

అనారోగ్య సమస్యలు 
బాల్య వివాహాలతో  చాలా మంది కౌమార దశ పూర్తి గాకుండానే గర్భం దాలుస్తున్నారు. ఈ కారణంగా వారికి నెలలు నిండకుండా శిశువు జన్మించడం, సరైన సమయంలో జన్మించినా బరువు తక్కువగా ఉండటం  జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బుద్ధిమాంద్యం, చురుకుగా లేకపోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లులకు ప్రసవం తర్వాత తల్లిపాలు సరిగ్గా పడవు. దీంతో శిశువులు పలుమార్లు ఇన్‌ఫెక్షన్లకు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.   – డాక్టర్‌ అమరనాథరెడ్డి, చిన్నపిల్లల వైద్యుడు, కర్నూలు

టీనేజీ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమాలు 
జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్‌ శాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే స్థానిక పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బందితో కలిసి వెళ్లి పెళ్లి జరగకుండా చూస్తున్నాం. అప్పటికే వివాహం జరిగి ఉంటే ఆమె టీనేజీలో గర్భం దాల్చకుండా ఆరోగ్య సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నాం. టీనేజీలో గర్భం దాల్చడం వల్ల వచ్చే దుష్పరిణాల గురించి బాలికలకు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.  –డాక్టర్‌ ఎల్‌.భాస్కర్, ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement