ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్‌!?

అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట హైడ్రామా

తెల్లవారు జామున తీసుకెళ్లిన హాస్టల్‌ నిర్వాహకులు

కారంచేడు:  గుండుతో ఉన్న వ్యక్తి తమకు ఏవో కొనిస్తామని ఆశ చూపి బాపట్లలో కిడ్నాప్‌ చేయడంతో భయపడి తప్పించుకొచ్చామని ఇద్దరు విద్యార్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వేకువ జాము వరకు కారంచేడు పోలీసుస్టేషన్‌ వద్ద హైడ్రామా నడిచింది. వివరాల్లోకి వెళితే... పర్చూరు మండలం గర్నెపూడికి చెందిన పులి నరేష్‌ కుమారుడు ఆకాష్, గుంటూరు జిల్లా బాపట్ల మండలం కర్లపాలేనికి చెందిన జాలాది ఆనంద్‌ కుమారుడు జాన్‌వెస్లీలు గుంటూరు జిల్లా బాపట్ల మూర్తినగర్‌ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. 

వీరు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారంచేడు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సంచరిస్తుంటే డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ ప్రసన్నకుమార్‌ గమనించాడు. మీరు ఎవరు? ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో తమను ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసి చీరాల వైపు తీసుకెళ్తుంటే తప్పించుకొచ్చామని చెప్పారు. వెంటనే స్పందించిన ప్రసన్నకుమార్‌ స్థానిక ఎస్‌ఐతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం అందించి అందరినీ అలర్ట్‌ చేశాడు. ఉన్నతాధికారుల సూచన మేరకు చిన్నారులిద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. వారు కొద్ది సేపు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అప్పటికే వారు ఆకలితో ఉండటంతో ఆ సమయంలో స్టేషన్‌ సమీపంలోని చిల్లర దుకాణం తెరిపించి చిరుతిళ్లు తినిపించారు. ఆకలి తీరిన తర్వాత ప్రసన్నకుమార్‌ వారిని నిదానంగా విచారించాడు. 

అప్పుడు వారు తమ హాస్టల్‌లోని టీచర్‌ కొడుతుండటంతో హాస్టల్‌ నుంచి పారిపోయి వచ్చామని అంగీకరించారు. వెంటనే బాపట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్టల్‌ నిర్వాహకులు వేకువ జామున 4 గంటలకు వచ్చి విద్యార్థులను తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థులను గమనించి గంటల సమయంలో వారిని గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడంలో చకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ ప్రసన్నకుమార్‌ను, ఆయనకు సహకరించిన వెంకట్రావును ఉన్నతాధికారులు, సిబ్బంది, హాస్టల్‌ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top