రెండు కుటుంబాల్లో విషాదం

Two Died In Road Accident At AVANIGADDA - Sakshi

పులిగడ్డ (అవనిగడ్డ): కటిక చీకటి.. దీనికి తోడు వర్షం కురుస్తుండటంతో వాహన చోదకులు వేగాన్ని పెంచారు. అతి వేగమే ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వేగంగా ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన పులిగడ్డ వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని రేగుల్లంకకు చెందిన దాసరి రమేష్‌ (33) జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావుతో కలిసి విజయవాడలో చికిత్స పొందుతున్న రామచంద్రపురం మాజీ సర్పంచ్‌ అద్దంకి నారాయణను చూసేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లారు.

 నారాయణను పరామర్శించిన అనంతరం కారులో అవనిగడ్డకు చేరుకున్నారు. రాత్రి పదిన్నరకు తిరిగి ఇంటికి బైక్‌పై రమేష్‌ బయలుదేరాడు. రాముడుపాలెం నుంచి బైక్‌పై ఇంటికి వస్తున్న అవనిగడ్డకు చెందిన బురాన్‌వలి (35) స్థానిక అటవీశాఖ కార్యాలయం ఎదురుగా వచ్చేసరికి ఒకరినొకరు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బురాన్‌వలి అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. బురాన్‌వలికి రెండేళ్ల క్రితమే వివాహమైంది. పిల్లలు లేరు. రమేష్‌కి ఇంకా వివాహం కాలేదు. మృతులిద్దరూ ఆయా కుటుంబాలకు పెద్ద  కుమారులే. 

పులిగడ్డలోనే ఆగుంటే..
విజయవాడ నుంచి వస్తున్న రమేష్‌ని పులిగడ్డ రాగానే జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు రాత్రయింది ఇక్కడ దిగి ఇంటికి వెళ్లమని చెప్పారు. అయితే అవనిగడ్డలో బైక్‌ ఉందని, దానిని తీసుకుని వస్తానని చెప్పి రమేష్‌ అవనిగడ్డ వచ్చాడు. పులిగడ్డకు చెందిన పులిగడ్డ పిచ్చేశ్వరరావు ఇంటికి వెళదాం రమ్మని రమేష్‌ను కోరగా కొద్దిగా పనుందని చెప్పి రమేష్‌ సిగరెట్‌ కాల్చుకుని బయలు దేరి వెళ్లి ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. పులిగడ్డలో దిగినా, పిచ్చేశ్వరరావుతో కలిసి వెళ్లినా బతికేవాడేమోనని బంధువులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది.

ఉద్యోగం కోసం ప్రయత్నం.. 
బురాన్‌వలి బీఈడీ, వ్యాయామ ఉపాధ్యాయ ట్రైనింగ్‌ చేశారు. గతంలో జరిగిన రెండు డీఎస్సీల్లో 92, 94 మార్కులతో డీఎస్సీ చేజారింది. ఈ సారి డీఎస్సీలో ఎలాగైనా పోస్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్న బురాన్‌వలి ఎంతో కష్టపడి చదువుతున్నాడు. చల్లపల్లి మండలంలోని రాముడుపాలెంలో ఇతని పేరున మద్యంషాపు ఉండగా అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బురాన్‌వలి తండ్రి షేక్‌ మస్తాన్‌ బాషా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎదురుగా ఉన్న కొత్తవంతెన ప్రాంతంలో పాత ఇనుప సామాన్ల షాపు నిర్వహిస్తున్నారు. 

సింహాద్రి రమేష్‌బాబు పరామర్శ
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ సింహాద్రి రమేష్‌బాబు, మాజీ సర్పంచ్‌ నలుకుర్తి పృధ్వీరాజ్, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌ (రాజా), జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు గాజుల మురళీకృష్ణ, టీడీపీ నేత బండే రాఘవ తదితరులు వైద్యశాలకు వెళ్లి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. రమేష్‌ మృతదేహానికి స్థానిక రేగుల్లంక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించగా   బురాన్‌వలి సోదరుడు జర్మనీలో ఉండటంతో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ మణికుమార్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top