కన్నీటి కెరటం

two dead one missing in Bhimavaram - Sakshi

పేరుపాలెం బీచ్‌లో విషాదం

 ఇద్దరి మృతి.. ఒకరి గల్లంతు

 అందరూ భీమవరం వాసులే

 స్నేహితులతో సరదాగా వెళ్లి..

 మూడు కుటుంబాల్లో చీకట్లు

ఆదివారం సెలవు.. అందునా కార్తీక మాసం.. స్నేహితులంతా సరదాగా పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. ఎగసి పడుతున్న అలలను చూడగానే వారిలోని ఉత్సాహం ఉరకలెత్తింది.  కేరింతలు కొడుతూ.. సముద్రంలోకి పరిగెత్తారు. నవ్వులు.. తుళ్లింతలు.. స్నేహితులంతా సరదాగా ఉన్న వేళ.. ఒక్కసారిగా మృత్యు కెరటం పడగ విప్పింది. ముగ్గురిని సముద్రగర్భంలోకి లాక్కెళ్లిపోయింది. నిండా 30 ఏళ్లు నిండకుండానే కడలి కాటుకు ఇద్దరు బలయ్యారు. ఒకరి జాడ తెలియరాలేదు.

మొగల్తూరు/ భీమవరం టౌన్‌: కార్తీకమాస పుణ్యస్నానం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఆదివారం సముద్ర స్నానం కోసం పేరుపాలెం బీచ్‌కు వచ్చిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మరణిం చారు. ఒకరు గల్లంతయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. భీమవరానికి చెందిన పత్తి సురేంద్ర(28), బుడిగ అవినాష్‌(28), గొంట్ల కుమార్, చినిమిల్లి స్వామి, మునగాల వాసు ఆదివారం మధ్యాహ్నం పేరుపాలెం బీచ్‌కు వచ్చారు. పేరుపాలెం కనకదుర్గా బీచ్‌ సమీపంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తుండగా.. సురేంద్ర,  అవినాష్, గొంట్ల కుమార్‌ గల్లంతయ్యారు. సురేంద్ర, అవినాష్‌ మృతదేహాలు కొద్దిసేపటికి తీరానికి కొట్టుకొచ్చాయి.  సురేంద్ర భీమవరంలోఎరువుల వ్యాపారం చేస్తుండగా, అవినాష్‌ పాలకొల్లులో ఐసీఐసీఐ బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్‌ భీమవరంలోనే ఒక బియ్యం దుకాణంలో పని చేస్తున్నాడు. వీరి స్నేహితులు చినిమిల్లి స్వామి భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇతనిది వీరవాసరం మండలం రాయలం. మునగాల వాసుకు భీమవరంలో మిఠాయి దుకాణం ఉంది.  వీరంతా చిన్ననాటి నుంచి స్నేహితులు.

తీరంలో రోదనలు
ఇద్దరు మిత్రులు చనిపోవడం, ఒకరు గల్లంతు కావడంతో మిగిలిన ఇద్దరు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు కడలి కెరటాల హోరులో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న సురేంద్ర, అవినాష్‌ తల్లిదండ్రులు బీచ్‌కు చేరుకుని గుండెలవిసేలా విలపించారు. దుర్ఘటనపై మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

భీమవరంలో విషాదఛాయలు
దుర్ఘటనతో భీమవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీచ్‌కు వెళ్లిన ఐదుగురు స్నేహితులూ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. వీరంతా చిన్ననాటి స్నేహితులు. రోజూ సాయంత్రం సరదాగా కలిసి కాసేపు గడపడం వీరికి అలవాటు.

తల్లి పాదాలకు నమస్కరించి వెళ్లాడు
ఉండి రోడ్డులోని మల్టీప్లెక్స్‌ సమీప ప్రాంతానికి చెందిన సోమేశ్వరరావు, నళిని దంపతుల కొడుకు బుడిగ అవినాష్‌. ఇటీవలే ఇతను ఐసీఐసీఐ పాలకొల్లు బ్రాంచ్‌లో మేనేజర్‌గా ఉద్యోగం పొందాడు. నెమ్మదస్తుడు. సోమేశ్వరరావు, నళిని దంపతులకు అవినాష్‌తోపాటు ఒక కుమార్తె ఉన్నారు. మిత్రులతో కలిసి పేరుపాలెం బీచ్‌కు వెళ్లేముందు అవినాష్‌ తల్లి పాదాలకు నమస్కరించి వెళ్లాడని, అదే కడసారి చూపవుతుందని ఎవరూ అనుకోలేదని చుట్టుపక్కల వాళ్లు  కన్నీటితో చెబుతున్నారు.

తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా
పత్తి శేషయ్య, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు సురేంద్ర. వీరికి ఇద్దరు కొడుకులు. ఒకతను హైదరాబాద్‌లో ఉంటుండగా.. సురేంద్ర ఇక్కడే తండ్రి ధాన్యం, ఎరువుల కమీషన్‌ వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. భీమేశ్వరస్వామి గుడి సమీపంలో నివాసం ఉంటున్న శేషయ్య కుటుంబం చాలా నెమ్మదస్తులని అక్కడివారంతా చెబుతున్నారు. సురేంద్ర మృదు స్వభావి అని పేర్కొంటున్నారు. తల్లి సుబ్బలక్ష్మి ఆరోగ్యం బాగోకపోవడంతో కొడుకు సురేంద్ర మృతి చెందిన సంగతి చెప్పకుండా దాచారు. తండ్రి పేరుపాలెం వెళ్లారని స్థానికులు కన్నీళ్లతో చెప్పారు.  

తండ్రి ఊర్లో లేడు
భీమవరం మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా మోగంటి వారి వీధిలో నివసిస్తున్న గొంట్ల మొగలయ్య, లక్ష్మీనారాయణమ్మ దంపతుల కొడుకు గొంట్ల కుమార్‌. కుమార్‌తోపాటు వారికి ఓ కుమార్తె ఉంది. మొగలయ్య కొండచీపుర్లు, నవ్వారు, మడతమంచం క్లాత్‌  విక్రయిస్తుంటారు. కుమార్‌ ధాన్యం దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మొగలయ్య ఊర్లో  లేకపోవడంతో మిత్రులతోపాటు పేరుపాలెం బీచ్‌కు వెళ్లిన కుమార్‌ కనిపించడం లేదన్న విషయం తెలుసుకున్న బంధువులు అక్కడికి  హుటాహుటిన బయల్దేరి వెళ్లారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top