ఖాకీల్లో గుబులు

Transfers in Chittoor Police Department - Sakshi

గతంలో టీడీపీ నేతలకు వంతపాడిన పోలీసులు

అధికార అండతో వైఎస్సార్‌సీపీపై ప్రతాపం

ప్రభుత్వం మారడంతో తప్పిదాలపై వణుకు

పోస్టింగుల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు

చిత్తూరు అర్బన్‌ : పోలీసులంటే పార్టీలకతీతంగా నడుచుకుంటూ సామాన్యుల్లో నమ్మకాన్ని కల్పించాలనే కనీస విషయాన్ని చాలా మంది అధికారులు మరచిపోయారు. ఇతర జిల్లాల్లో ఉన్న కొందరు సీఐలు, ఎస్‌ఐలు ఆదాయం కోసం జిల్లాలోని ప్రధాన సర్కిళ్లలో పోస్టింగులు వేసుకోవడానికి టీడీపీ నేతల చెంతన చేరారు. ‘మీరు చెప్పినట్టల్లా చేస్తామన్నా.. మాట తప్పితే అడగండి’ అనే షరతుతో పోస్టింగ్‌ వేసుకున్న కొందరు పోలీసు అధికారుల తీరు దారుణంగా ఉండేది. అసలు న్యాయం కోసం సామాన్యుడు స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. ఉన్నతాధికారుల నడవడికే అధికార పార్టీకి అనుకూలంగా ఉండటంతో కిందిస్థాయి అధికారులు వాళ్లను ఆదర్శంగా తీసుకుని రెచ్చిపోయారు. ఓ వైపు వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కేసులు పెట్టడం, స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడం చేస్తూనే మరోవైపు సివిల్‌ సెటిల్‌మెంట్లు, భూకబ్జాదారులకు అండగా నిలబడ్డారు.

ఇవీ మచ్చుతునకలు..
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఓ సీఐ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. ఈయనకు నారా లోకేష్‌తో సన్నిహిత సంబంధాలున్న డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు వత్తాసు పలకడంతో నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి అర్ధరాత్రుల్లో ఇళ్లలోకి చొరబడి దౌర్జన్యకాండ చేశారు.
ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పోలీసు శాఖలోని ఓ ఉన్నతాధికారి అర్ధరాత్రి కళ్లకు గంతలు కట్టి తమిళనాడు సరిహద్దులోకి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టడం వెనుక రాష్ట్రస్థాయి టీడీపీ నేతల ఒత్తిడి ఉందనేది బహిరంగ రహస్యం.
చిత్తూరులోని ఓ డీఎస్పీ పచ్చ కండువా కప్పుకుని ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఇక్కడి మోడల్‌ కోడ్‌ కండక్ట్‌ బృంద అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ వైఎస్సార్‌సీపీ నేతపై తప్పుడు కేసులు పెట్టించారు. ఇదే సమయంలో టీడీపీ నేతలపై వచ్చిన ఫిర్యాదులను వదిలేశారు.
ఇక చిత్తూరులోని స్పెషల్‌ బ్రాంచ్‌లో ఇతర సామాజికవర్గాలకు చెందిన 11 మందిని బదిలీ చేసి సీఎం సామాజికవర్గానికి చెందిన సిబ్బందిని, ఎస్‌ఐలను, డీఎస్పీలను కొనసాగించాలనే చినబాబు ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు.
చిత్తూరులోని ఓ టీడీపీ కార్పొరేటర్‌ భర్త వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై రాళ్లువేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీనికి ప్రతిగా ఐపీఎల్‌ బెట్టింగులో రూ.1.30 లక్షలతో పట్టుబడ్డ టీడీపీ కార్యకర్తల నుంచి ఆ మొత్తాన్ని తీసుకుని ఓ సీఐ కేసు లేకుండా చేశారు. ఇదే స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తతో మా ట్లాడిన నేరానికి ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను పాలసముద్రంకు బదిలీ చేసి సీఐ స్వామిభక్తి చాటుకున్నాడు.

అన్నా పోస్టింగ్‌..
టీడీపీ నేతల అండదండలతో రెచ్చిపోయిన కొందరు పోలీసు అధికారులు ప్రస్తుతం పోస్టింగులకు కాపాడుకోవడానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని పోస్టింగ్‌ కోసం కాళ్లరిగేలా చుడుతున్నారు. చేసినన్ని రోజులు నిజాయితీగా ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అధికారులను చూస్తున్న జనం నవ్వుకోవడం కొసమెరుపు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top