ఇద్దరు పిల్లలతో సహా భర్త ఆత్మహత్య

Tragedy at Guntur district Mangalgiri - Sakshi

గుంటూరు జిల్లా మంగళగిరిలో విషాదం

మంగళగిరూరల్‌: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య నెల రోజులక్రితం కన్నుమూసింది. భార్యావియోగం భరించలేక అనుక్షణం ఆమె గురించే ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపంతో తన ఇద్దరు కొడుకులకు విషం ఇచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. ఈ హృదయవిదారక సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కొప్పురావు కాలనీకి చెందిన తిరువీధుల లక్ష్మీనారాయణ బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లక్ష్మీనారాయణకు 13 సంవత్సరాల క్రితం శిరీషతో వివాహం జరిగింది.

వీరికి కుమారులు తేజశ్వర్‌(11), అమరేశ్వర్‌(9) ఉన్నారు. గత నెల 12వ తేదీన శిరీష అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి. అర్ధాంగి మరణాన్ని జీర్ణించుకోలేక తాను కూడా తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు తన స్నేహితులకు, బంధువులకు వాట్సప్‌ ద్వారా ‘ఇక సెలవు.. మీ అండ్‌ మై సన్స్‌ లాంగ్‌ స్లీప్‌’ అంటూ సందేశం పంపాడు. తదనంతరం తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తీసుకున్నాడు.

లక్ష్మీనారాయణ తండ్రి సాంబశివరావుకు స్నేహితులు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూడగా ముగ్గురూ మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి ముగ్గురూ మరణించినట్టుగా నిర్ధారించారు. మంచంపై లభించిన స్యూసైడ్‌ నోట్‌లో లక్ష్మీనారాయణ మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. ‘‘శిరీష మరణంతోనే నేను మానసికంగా మృతిచెందాను.

శిరీష అస్తికలను దాచివుంచాను. మాతోపాటే తన అస్తికలను కలిపి పూడ్చండి. మేము నలుగురం ఒకే చోట ఉండాలి. నా చివరి కోర్కెను తీర్చండి’’ అంటూ అందులో పేర్కొన్నాడు. కోడలు మరణించిన నెలకే కొడుకు మనవళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో లక్ష్మీనారాయణ తండ్రి సాంబశివరావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

తేజశ్వర్, అమరేశ్వర్‌ (ఫైల్‌) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top