సమైక్య సెగతో జిల్లాలో ‘తుఫాన్’ ఆగింది. కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన తుఫాన్ సినిమా ప్రదర్శనను శుక్రవారం సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు.
సమైక్య సెగతో జిల్లాలో ‘తుఫాన్’ ఆగింది. కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మంత్రి చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన తుఫాన్ సినిమా ప్రదర్శనను శుక్రవారం సమైక్యవాదులు, ఉద్యోగ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చిత్ర ప్రదర్శనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ సమైక్యవాదుల ఆందోళనతో చిత్ర ప్రదర్శన నిలిపివేయక తప్పలేదు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా చిరంజీవి తన పదవికి రాజీనామా చేసే వరకూ సినిమా ప్రదర్శనకు ఒప్పుకోమని హెచ్చరించారు.
అనంతపురం సిటీ/క్రైం : అనంతపురంలో రామ్‌చరణ్ ‘తుఫాన్’ సినిమాను ప్రదర్శిస్తున్న గంగా, గౌరి థియేటర్లపైకి సమైక్యవాదులు రాళ్లు రువ్వారు. చిత్ర ప్రదర్శన నిలిపి వేయాలని తొలుత కోరినా యజమానులు సహకరించకపోవడంతో వారు రాళ్లు రువ్వాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమైక్యవాదులతో చర్చించారు. చివరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయడంతో సమైక్యవాదులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
కాగా సమైక్యవాదులు థియేటర్‌పైకి రాళ్లు రువ్విన సమయంలో రామకృష్ణ అనే పాత్రికేయుడు గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో స్పృహతప్పి కిందపడ్డ అతడిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రాళ్లు రువ్విన ఘటనపై థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేయనందున ఎవరిపైనా కేసు నమోదు చేయలేదని వన్‌టౌన్ ఎస్‌ఐ జాకీర్ హుసేన్ తెలిపారు.
రెండో ఆట నుంచి ప్రదర్శన నిలిపివేత
కదిరి : తుఫాన్ చిత్రం విడుదల సందర్భంగా శుక్రవారం కదిరిలోని రాధిక థియేటర్ వద్ద ఎస్‌ఐ తబ్రేజ్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు రక్షణ వలయంలో ఉదయం 11.30 గంటలకు మొదటి ఆటను ప్రదర్శించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఉద్యోగ జేఏసీ నాయకులు సమైక్యవాదులను వెంటబెట్టుకుని థియేటర్ వద్దకు చేరుకున్నారు. సినిమాను ప్రదర్శించరాదని ఆందోళనకు దిగడంతో జేఏసీ కన్వీనర్ జేవీ రమణ, గౌరవాధ్యక్షుడు ఆత్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జీపు ఎక్కించారు. దీంతో ‘పోలీస్ జులుం నశించాలి... జై సమైక్యాంధ్ర’ అన్న నినాదాలతో సమైక్యవాదులు జీపును అడ్డుకోవడంతో చేసేది లేక పోలీసులు వారిని అక్కడే వదిలేశారు. అనంతరం సమైక్యవాదులు థియేటర్ ముందు ధర్నాకు దిగారు. కేంద్ర మంత్రి చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేసేవరకు సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత థియేటర్ నిర్వాహకులు అక్కడికొచ్చి ‘తుఫాన్’ సినిమా ప్రదర్శనను ఆపేస్తున్నామని చెప్పడంతో సమైక్యవాదులు శాంతించారు. ‘సమైక్య సెగకు తుఫాన్ ఆగిపోయింది’ అంటూ వారు అక్కడినుంచి వెనుదిరిగారు.
థియేటర్‌కు తాళం.. పోస్టర్ల దహనం
ఉరవకొండ : ఉరవకొండలో తుఫాన్ సినివూ ప్రదర్శనను ఉద్యోగ, ఉపాద్యాయు జేఏసీ నాయుకులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర అంటు నినాదాలు చేస్తూ వెంకటేశ్వర థియేటర్‌లోకి దూసుకెళ్లారు. జేఏసీ చైర్మన్ శ్రీరావుులు, హనువుప్ప, తిప్పయ్యు ఆధ్వర్యంలో థియేటర్ యుజవూనితో చర్చించి, ప్రదర్శనను నిలిపివేశారు. ప్రేక్షకులను వెనక్కు పంపించారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు థియేటర్ గేటుకు తాళం వేశారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద తుఫాన్ సినిమా పోస్టర్లను వైఎస్సార్‌సీపీ నాయకులు దహనం చేశారు. పార్టీ పట్టణ కన్వీనర్ బసవరాజు, ఉపసర్పంచ్ జిలకర మోహన్ మాట్లాడుతూ చిరంజీవి మొదట సమైక్యాంధ్రకు మద్దతు తెలిపి, పదవికి రాజీనామా చేస్తేనే ఆయన తనయుడు రామ్ చరణ్ నటించిన ‘తుఫాన్’ ప్రదర్శనకు అనుమతిస్తామన్నారు. కార్యక్రవుంలో మేజర్ పంచాయుతీ వార్డు సభ్యలు పెద్దన్న, ఈడిగప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
అభిమానులు-సమైక్యవాదుల వాగ్వాదం
తాడిపత్రి రూరల్ : తాడిపత్రిలోని సాయితేజ థియేటర్ వద్ద తుఫాన్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని సమైక్యవాదులు, ప్రదర్శించాలని మెగా అభిమానులు వాగ్వాదానికి దిగారు. ఆందోళ చేస్తున్నా సినిమాను ప్రదర్శించడంతో సమైక్యవాదులు గేటు ఎక్కి థియేటర్‌లోకి దూసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ లక్ష్మినారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.అయితే ప్రదర్శనను నిలిపేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు థియేటర్ యజమానులతో మాట్లాడి ప్రదర్శనను నిలిపివేయించారు. అయితే మెగా అభిమానులు సినిమాను పూర్తిగా ప్రదర్శించాలని, అంతవరకు బయటకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అభిమానులు- సమైక్యవాదుల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సీఐ కలగజేసుకున్నారు. సినిమాను మరో 10 నిమిషాలు ప్రదర్శింపజేసి.. అనంతరం నిలిపివేయిస్తామని సర్దిచెప్పడంతో సమైక్యవాదులు శాంతించారు. అనంతరం పోలీసులు ‘తుఫాన్’ సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నట్లు బోర్డు తగిలించారు.