టమాటా అధరహో!

Tomato is priced above at Rs 40 per kg at Madanapalle Market - Sakshi

మొదటి రకం కిలో ధర రూ.40.80 

ఈ ఏడాదిలో ఇదే అత్యధికం.. రైతుల్లో ఆనందం

మరో నెల రోజులు ఇదే పరిస్థితి!  

మదనపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో శనివారం మొదటి రకం టమాటా కిలో రికార్డు స్థాయిలో రూ.40.80 ధర పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు మార్కెట్‌లో నమోదైన అత్యధిక ధర ఇదే. సాధారణంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్ద మొత్తంలో రైతులు టమాటాను సాగు చేస్తారు. మే, జూన్, జూలై నెలల్లో దిగుబడులు వస్తాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలో ఆశించిన మేరకు ధర పలకకపోవడంతో రైతులు నిరాశ చెందారు. జూన్‌ ప్రారంభం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షల్లో సడలింపులు రావడం, రెస్టారెంట్లు, హోటళ్లు తెరచుకోవడం, ప్రజాజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుండడంతో మెల్లగా ధరలు పుంజుకున్నాయి. దీనికితోడు అనంతపురం జిల్లాతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో టమాటా ఉత్పత్తి నిలిచిపోవడం, సరుకు లభ్యత తక్కువగా ఉండటం ఇక్కడి రైతులకు కలసి వచ్చింది.  శనివారం మార్కెట్‌కు రైతులు 800 మెట్రిక్‌ టన్నుల టమాటాను తీసుకురాగా.. మొదటిరకం కిలో రూ.30 నుంచి రూ.40.80, రెండో రకం రూ.20 నుంచి రూ.29.40 వరకు ధర పలికాయి. చాలారోజుల తర్వాత ఆశించిన మేరకు ధర రావడంతో టమాటా సాగు చేస్తున్న రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్‌ నుంచి విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కోల్‌కతా, తెలంగాణ, మహారాష్ట్రకు ఎగుమతులు జరుగుతున్నాయి.

ధరలు ఆశాజనకం
మార్చి, ఏప్రిల్‌లో దిగుబడులు అధికంగా ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం, రవాణా, వ్యాపార అవకాశాలను విస్తృతం చేయడం, ఆంక్షలు సడలించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి.
– రమణారెడ్డి, రైతు, ముష్టూరు పంచాయతీ, నిమ్మనపల్లె మండలం

ఇంకా పెరిగే అవకాశాలు
టమాటాకు మరో నెలరోజులపాటు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయి. పంట దిగుబడులు తగ్గుముఖం పట్టడం, ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి లేకపోవడం ఇక్కడ ధర పెరిగేందుకు కారణమయ్యాయి. సరుకు కొనుగోలుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లెకు వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లోని ధరలతో రైతులు సంతృప్తిగా ఉన్నారు.     
–మనోహర్, సెక్రటరీ, మదనపల్లె మార్కెట్‌ కమిటీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top