రెండు రెళ్లు ఆరు | Today the debt relief scheme Launch CM | Sakshi
Sakshi News home page

రెండు రెళ్లు ఆరు

Dec 11 2014 3:12 AM | Updated on Jun 4 2019 5:04 PM

రెండు రెళ్లు ఆరు - Sakshi

రెండు రెళ్లు ఆరు

అధికారమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నికల్లో హామీల వర్షం కురిపించిన చంద్రబాబు.. గద్దెనెక్కాక వాటిని నెరవేర్చడం నీరుగార్చుతున్నారు.

ఈయన పేరు క్రిష్ణమూర్తి. మదనపల్లె మండలం పాళ్యంకొండకు చెందిన ఈ రైతు చిన్నతిప్పసముద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారు ఆభరణాలను కుదువపెట్టి నవంబర్ 5, 2013న ఖాతా నంబరు 563721942పై రూ.35 వేల రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారులకూ రెవెన్యూ సిబ్బందికీ పట్టాదారు పాసుపుస్తకం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును క్రిష్ణమూర్తి ఇచ్చారు.కానీ.. ఐదు రోజుల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణవిముక్తి పథకం లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో క్రిష్ణమూర్తి లబోదిబోమంటున్నాడు. ఒక్క క్రిష్ణమూర్తే కాదు.. అన్ని ఆధారాలు సమర్పించిన 2.56 లక్షల మంది రైతులకు రుణ విముక్తి పథకంలో స్థానం దక్కలేదు.
 
- తప్పులతడకగా రైతు ‘రుణ విముక్తి’ లబ్ధిదారుల జాబితా
- ఆధార్, రేషన్‌కార్డులు సమర్పించినా జాబితాలో తప్పించిన వైనం
- 5.62 లక్షల నుంచి 3.06 లక్షలకు లబ్ధిదారుల తగ్గింపు
- నేడు రుణవిముక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

సాక్షి ప్రతినిధి, తిరుపతి: అధికారమే లక్ష్యంగా సార్వత్రిక ఎన్నిక ల్లో హామీల వర్షం కురిపించిన చంద్రబాబు.. గద్దెనెక్కాక వాటిని నెరవేర్చడం నీరుగార్చుతున్నారు. వ్యవసాయ రుణాల మాఫీ హామీ అమలే అందుకు పరాకాష్ట. రైతు రుణ విముక్తిగా పేరు మార్చి ఆ హామీనే చంద్రబాబు మాఫీ చేస్తున్నారని కర్షకలోకం మండిపడుతోంది. రైతు రుణ విముక్తి పథకాన్ని గురువారం సీఎం చంద్రబాబు చిత్తూరులో ప్రారంభించనున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించింది ఒక్క వ్యవసాయ రుణాల మాఫీ హామీనని ఆ పార్టీ నేతలూ.. రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికారాన్ని కట్టబెట్టిన హామీనే సీఎం చంద్రబాబు మాఫీ చేస్తున్నారు. జిల్లాలో డిసెంబర్ 31, 2013 నాటికి 8,70,231 మంది రైతులు రూ.11, 180.25 కోట్లను వ్యవసాయ రుణాల రూపం లో బ్యాంకులకు బకాయిపడ్డారు. చంద్రబా బు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఒక్క సంతకంతో ఆ రుణాలన్నింటినీ మాఫీ చేయాలి. కానీ.. ఆ హామీ అమలుకు చేసిన తొలి సంతకంతోనే రైతులను పరిహసించారు.

రోజుకో తిరకాసు.. పూటకో విధానంతో ఏకంగా వ్యవసాయ రుణల మాఫీని.. రైతు రుణ విముక్తిగా చంద్రబాబు మార్చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(ఎకరానికి ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలన్నది ఎస్‌ఎల్‌బీసీ తీర్మానిస్తుంది- దాన్నే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటా రు) వర్తింపజేసి, ఆధార్, రేషన్‌కార్డులతో ముడిపెట్టి.. సాగుచేసిన పంటలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని బ్యాంకర్లకు హుకుం జారీ చేశారు.

ప్రభుత్వం జారీచేసిన తిరకాసు మార్గదర్శకాల మేరకు 5,62,932 మంది లబ్ధిదారులు రైతు రుణ విముక్తి పథకానికి అర్హులుగా బ్యాంకర్లు తేల్చారు. ఆ మేరకు ప్రభుత్వానికి జాబితాను పంపారు. కనీసం ఆ జాబితానైనా యథాతథంగా ఆమోదించాల్సి న ప్రభుత్వం మరో కుట్రకు తెర తీసింది. ఆధార్‌కార్డు.. రేషన్‌కార్డు.. పట్టాదారు పాసుపుస్తకంలో పేర్కొన్న అంశాలకు సరిపోవడం లేదనే సాకు చూపి 2,56,388 మంది రైతులను రుణ విముక్తి పొందడానికి అనర్హులుగా ఏకపక్షంగా తేల్చేసింది.

కేవలం 3,06,544 మంది రైతులు మాత్రమే రైతు రుణ విముక్తి పథకం కింద అర్హులుగా రెండు విడతలుగా విడుదల చేసిన జాబితాల్లో స్పష్టీకరించింది. కనీసం 3.06 లక్షల మంది రైతులకైనా పూర్తి స్థాయిలో రుణ విముక్తిని కల్పిస్తారా అంటే అదీ లేదు. ఆ రైతులకు కేవలం రూ.894 కోట్ల మేర మాత్రమే రుణ విముక్తి ద్వారా దక్కే అవకాశం ఉందని బ్యాంకు అధికారవర్గాలు లెక్కలు వేస్తుండడం గమనార్హం.

రైతు రుణ విముక్తి పథకంతో జాప్యంతో రైతులపై రూ. 939 కోట్ల అపరాధ వడ్డీ భారం పడింది. ఆ వడ్డీ భారం కన్నా రుణవిముక్తి పథకం ద్వారా రైతులకు దక్కుతోందని తక్కువ కావడం గమనార్హం. ప్రభుత్వ నిర్వాకం వల్ల లబ్ధిదారు ల జాబితా తప్పులతడకగా మారడం.. 2.56 లక్షలమంది పేర్లు గల్లంతవడంతో రైతు రుణ విముక్తి వారోత్సవాల్లో భాగంగా గ్రామాలకు వెళ్లడానికి అధికారులు, టీడీపీ ప్రజాప్రతి నిధులు జంకుతుండడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement