నాబార్డు నిధుల ద్వారా పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు రింగయ్యారు.
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: నాబార్డు నిధుల ద్వారా పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనుల టెండర్లలో కాంట్రాక్టర్లు రింగయ్యారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఈ టెండర్లలో లక్షల రూపాయలు చేతులు మారాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జడ్పీ ఆవరణలో మంతనాలు జరిపిన కాంట్రాక్టర్లు అంచనా ధరకు మించి కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయి ప్రభుత్వ అంచనా ధర కంటే ఎక్కువగా కోట్ చేశారు. మరికొందరిని టెండర్లు వేయకుండా ఒప్పించి, పనులు పొందిన వారు టెండర్ వేయని వారికి తలా కొంత ముట్టజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇలా అంచనా కంటే ఎక్కువగా కోట్ చేయడంతో ఈ పనుల్లో ప్రభుత్వ ఖజానాకు గండి పడినట్లే.
ఖమ్మం అర్బన్, ముదిగొండ, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, పెనుబల్లి, తల్లాడ, వేంసూరు, కొణిజర్ల, వైరా, కారేపల్లి, ఏన్కూరుల్లో చేపట్టే రూ2.95 కోట్ల విలువైన గోపాలమిత్ర సర్వీస్ సెంటర్లు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర 41 పనులకు మంగళవారం జిల్లా పరిషత్ ఆవరణలోని పీఆర్‌ఐ డివిజన్ కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. ఈ 41 పనుల్లో 5, 6 మినహా మిగిలిన అన్నింటికీ కాంట్రాక్టర్లు రింగై అంచనా ధరకు మించి టెండర్లను దక్కించుకున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల అనుచరులు ఇతర కాంట్రాక్టర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి రింగయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నిధులలో 36 గోపాలమిత్ర సర్వీస్ సెంటర్‌ల నిర్మాణానికి రూ.7.50 లక్షలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి రూ.4 లక్షలు, గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి నాలుగు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4 లక్షల చొప్పున అంచనా విలువ నిర్ణయించారు. ఈ మొత్తం పనులకు కలిపి 5 శాతం పైగానే ఎక్కువకు కోట్ చేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వంపై లక్షల రూపాయల అదనపు భారం పడనుంది.
కోలాహలంగా జడ్పీ .....
పీఆర్‌ఐ డివిజన్ పరిధిలో నిర్వహించిన పనులను దక్కించుకునేందుకు పలువురు కాంట్రాక్ట్‌ర్లు ఉదయం 9 గంటలకే జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. భారీ ఎత్తున కాంట్రాక్టర్లు రావడంతో జడ్పీ ఆవరణ కోలహలంగా మారింది. అయితే ఈ టెండర్లను దక్కించుకునేందుకు అధికార పార్టీనేతల అనుచరులు కొందరిని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. చివరకు ఘర్షణలకు సైతం దిగారు. మొత్తానికి కాంట్రాక్టర్లు కూడపలుక్కొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కొంతమేర పంచుకున్నారు.