అడ్డుగోలు పనులు అప్పగించేందుకు సిద్ధమైన అధికారులకు చెంపపెట్టు తగిలింది. కాంగ్రెస్ నేతల మెప్పుకోసం నిబంధనలు తుంగలో తొక్కిన అధికారిపై విచారణకు ఆదేశించారు.
సాక్షి ప్రతినిధి, కడప: అడ్డుగోలు పనులు అప్పగించేందుకు సిద్ధమైన అధికారులకు చెంపపెట్టు తగిలింది. కాంగ్రెస్ నేతల మెప్పుకోసం నిబంధనలు తుంగలో తొక్కిన అధికారిపై విచారణకు ఆదేశించారు.
రూ.5.76 కోట్లతో నిర్వహించిన టెండర్లును రద్దు చేస్తూ ఎండీ రవిచందర్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలల్లోకి వెళితే...జిల్లాలోని సగిలేరు, మడకలవారిపల్లె రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూ.5.76కోట్లతో పనులు నిర్వహించేందుకు టెండర్లను ఆహ్వానించారు. 1350 క్యూబిక్ మీటర్ల నిర్మాణం అనుభవం ఉన్న వారికి మాత్రమే అర్హతగా రూపోందించారు.
అనంతరం 450 క్యూబిక్ మీటర్లు నిర్మాణం అర్హత ఉన్న వారందరూ పాల్గొనవచ్చని సవరించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టరుకు ఎస్‌ఈ స్థాయి అధికారి అప్పగించేందుకు చేశారని పలువురు కాంట్రాక్టర్లు ఎండీకి ఫిర్యాదు చేశారు. ఈవైనంపై బుధవారం సాక్షి పత్రిక ‘స్వామిభక్తి’ అంటూ ప్రధాన శీర్షిక ప్రచురించింది. ఈకథనాన్ని కొందరు కాంట్రాక్టర్లు ఎండీ రవిచందర్‌కు ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు చేశారు. ఆమేరకు ఆయన టెండర్ రీకాల్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
ఎస్‌ఈ ప్రతాప్‌రెడ్డి నిబందనలు తారుమారు చేయడంపై వివరణ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. టెండర్ నిబందనలు మార్చకా తగిన గడువు ఎందుకు ఇవ్వలేదని కోరినట్లు సమాచారం. ఉన్నతాధికారి అండతో అప్పనంగా రూ.5.76కోటు కాంట్రాక్టును దక్కించుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీ నేతకు ఈ పరిణామం మింగుడు పడని వ్యవహారంగా మారింది.
మాజీ మంత్రి ద్వారా పనులు దక్కపోతే పర్వాలేదు కనీసం సహకరించిన అధికారినైనా కాపాడండి అంటూ ప్రాధేయపతున్నట్లు సమాచారం. కాగా సగిలేరు, మడకలవారిపల్లె రెసిడెన్షియల్ పాఠశాల టెండర్లు రద్దు అయిన మాట వాస్తవమేనని జిల్లాకు చెందిన సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు సాక్షి ప్రతినిధికి ధ్రువీకరించారు.