
‘ఢీ’ఎస్సీ-14
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో మొదటి అంకం ముగిసింది. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)-14 పరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి.
ఏలూరు సిటీ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో మొదటి అంకం ముగిసింది. జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)-14 పరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. జిల్లాలో 123 స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), 341 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), 68 లాంగ్వేజ్ పండిట్ (ఎల్‌పీ) పోస్టులుఉండగా, మొత్తంగా 30వేల 17మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. నోటిఫికేషన్‌లో పేర్కొనని పోస్టులకు సైతం 2,081 దరఖాస్తులు అందటం విశేషం. దరఖాస్తులను ఈనెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పరిశీలించి డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. జిల్లాలో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు నుంచి అన్ని కేటగిరీలకూ 138 దరఖాస్తులు మాత్రమే అందాయి. జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పోస్టులకు 22,760 దరఖాస్తులు రాగా, సెకండరీ గ్రేడ్ పోస్టులకు 2,798 మంది, భాషా పండిట్ పోస్టులకు 2,378 దరఖాస్తులు అందాయి. పోటాపోటీజిల్లాలో 601 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, వాటిలో 532 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో కేవలం 123 పోస్టులు మాత్రమే ఉండటంతో పోటీ తీవ్రంగా మారింది. ఒక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్టుకు సంబంధించి గరిష్టంగా 9,154 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు. రెండో ర్యాంకులో స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్టు టీచర్ల పోస్టులకు 5,010 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తెలుగు పండిట్ పోస్టులకు 2,289 మంది రంగంలో ఉన్నారు.
పోస్టుల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా
స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం సబ్జెక్టు 17 పోస్టులకు 5,010, బయోలాజికల్ సైన్స్ 22 పోస్టులకు 3,702, సోషల్ స్టడీస్ 51 పోస్టులకు 9,154, ఇంగ్లిష్ 6 పోస్టులకు 1,082, తెలుగు 19 పోస్టులకు 2,503, హిందీ 4 పోస్టులకు 1,259, సంస్కృతం 3 పోస్టులకు 21, ఉర్దూలో ఒక్క పోస్టుకు 29 చొప్పున దరఖాస్తులు అందాయి. భాషా పండిట్ తెలుగులో 20 పోస్టులకు 2,289, ఉర్దూ 36 పోస్టులకు 15 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి, సంస్కృతం 12 పోస్టులకు 74 దరఖాస్తులు అందాయి. సెకండరీ గ్రేడ్ తెలుగు ప్లెయిన్ ఏరియాలో 305, ఏజెన్సీలో 36 పోస్టులకు 2,798 దరఖాస్తులు వచ్చాయి.