బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం!
ఏలూరులో దారుణం
ఓ సందులో అపస్మారకస్థితిలో పడి ఉన్న బాలిక
స్థానికుల సమాచారంతో జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు
లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం
ఏలూరు టౌన్: ఏలూరులో సోమవారం అర్ధరాత్రి మైనర్ బాలికపై లైంగిక దాడి కలకలం రేపింది. బాలికకు మద్యం తాగించి మరీ దుండగులు కిరాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. 12 పంపుల సెంటర్ సమీపంలో పూలకొట్టు ప్రాంతంలో చీకటిగా ఉన్న సందులో ఒక బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో పరీక్షల అనంతరం నిర్ధారిస్తామని వెల్లడించారు.
బాలిక మద్యం మత్తులో ఉండడంతో ఆమె చేత దుండగులు బలవంతంగా మద్యం తాగించి అకృత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె ఎవరనే వివరాలు తెలియరావడం లేదు. ఆమె స్కూల్ యూనిఫాంలో ఉండడంతో ప్రైవేటు స్కూల్ విద్యార్థినిగా భావిస్తున్నారు. ఏలూరు టూటౌన్ సీఐ అశోక్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్కూల్ విద్యార్థినినా, చెత్త ఏరుకునే బాలికనా అనేది కూడా తేలాల్సి ఉందని చెబుతున్నారు.
బాలిక అపస్మారక స్థితిలో పడిఉన్న ప్రాంతానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండటం, ఆ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ సంచారం ఇటీవల పెరగడంతో ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక స్పృహలోకి వస్తేగానీ పూర్తి వివరాలు చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. కూటమి పాలనలో బాలికలకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
