ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

Teacher Harassment to Student in YSR Kadapa - Sakshi

విద్యార్థినికి మెసేజ్‌లతో వేధింపులు ఎంఈఓకు ఫిరాదు

నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్‌

వైఎస్‌ఆర్‌ జిల్లా , రైల్వేకోడూరు రూరల్‌ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణతో వారి భవిషత్‌కు బాటలు వేయాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి సభ్యసమాజం, ఉపాధ్యాయులును తలదించుకునేలా చేసిన సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీపీఆర్‌ కండ్రికలో చోటు చేసుకుంది. తన కూతురు కంటే తక్కువ వయస్సు కలిగిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హీనంగా ప్రవర్తించడంతో మంగళవారం దేహశుద్ధి చేశారు.  వివరాలిలా..  మండలంలోని వీపీఆర్‌ కండ్రిలో ఉన్న ప్రభుత్వ  పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై కన్ను పడింది. ఆధార్‌కార్డుతో పాటు ఇచ్చిన ఫోన్‌ నెంబరును తీసుకుని మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టారు.  అశ్లీల వీడియోలు పెట్టే స్థాయికి చేరుకోవడంతో చేసేదేమీ లేక ఆ  విద్యార్థిని తోటి విద్యార్థులకు ఆ మెసేజ్‌లను చూపింది.

దీంతో సమాచారం బయటికి వ్యాపించి విద్యార్థిని బంధువులకు చేరింది. దీంతో బాధిత విద్యార్థిని బంధువులు మంగళవారం హైస్కూల్‌కు చేరుకుని ఉపాధ్యాయుడిని విచారించగా తాను ఏ తప్పు చేయలేదని వాగ్వాదం చేయడంతో  చితకబాదారు. ఈ విషయమై హెచ్‌ఎం మార్కెండేయ నాయుడును వారు ప్రశ్నించగా జరిగిందేదో జరిగింది ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, పాఠశాలకు చెడ్డ పేరు వస్తుందన్నారు. దీంతో వారు సూరపురాజుపల్లె గ్రామ సభలో ఎంఈఓ రామయ్య ఉన్నట్లు తెలుసుకుని ఆయనకు సెల్‌ఫోన్‌లో పంపిన మెసేజ్‌లను చూపారు. దీనిపై స్పందించిన ఆయన ఆ ఉపాధ్యాయుడుపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులపై ఆ విధంగా ప్రవర్తించిన ఆయనపై నిర్భయ కేసు నమోదు చేసి, విధుల నుంచి శాశ్వితంగా తొలగించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top