ఎన్నికల ఫలితాలపై టీడీపీ సర్వే! 

TDP Survey on Election Results - Sakshi

ఓటర్లకు వస్తున్న ఫోన్‌ కాల్స్‌ 

కంకిపాడు/ఉయ్యూరు: ‘‘కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మురాల అయ్యకు 08634500001 నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. తీరా ఫోన్‌ ఆన్‌ చేసిన వెంటనే ఇది ప్రజాభిప్రాయ సర్వే అని,  సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేశారు. టీడీపీ అయితే 1 నొక్కండి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అయితే 2 నొక్కండి, కాంగ్రెస్‌ అయితే 3, జనసేన అభ్యర్థికి ఓటు వేస్తే 4 నొక్కండి’’ అంటూ ఫోన్‌ వచ్చింది. రెండు రోజులుగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటర్లకు ఇవే ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు మే 23 వరకు గడువు ఉంది.

ఈ నేపథ్యంలో ప్రజానాడి తెలుసుకునేందుకు, గెలుపు ఓటములను బేరీజు వేసుకునేందుకు ఈ సర్వేలు చేపడుతున్నారనే భావన ఓటర్ల నుంచి వ్యక్తమవుతుంది. గతంలో ఈ తరహా ఫోన్‌ కాల్స్‌ సీఎం చంద్రబాబు నుంచి ప్రజలకు వచ్చాయి. ప్రభుత్వ పనితీరు, సేవలు అందుతున్న తీరుపై సమాచారం, ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఎన్నికలు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఇప్పటికే బూత్‌ల వారీగా ఓటింగ్‌ సరళి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు లభిస్తాయన్న అంచనాల్లో ఉన్నాయి.  

ఇది ముమ్మాటికీ టీడీపీ పనే.. 
ప్రజాభిప్రాయ సేకరణ ముమ్మాటికీ టీడీపీ పనేనని ప్రజలు భావిస్తున్నారు. ఓటింగ్‌ సరళి పూర్తిగా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పోలింగ్‌పై టీడీపీ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఓటరు ఏ వైపు ఉన్నాడనే సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోన్‌ సర్వేని చేపట్టిందన్న వాదన వినిపిస్తోంది. ఏ వర్గానికి చెందిన ఓట్లు ఏమేరకు తమకు అనుకూలంగా పడ్డాయన్న సమాచారం సేకరించే పనిలో పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top