దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా ఈ నెల 4న ఎన్నికల అధికారి విధులను ఆటంకపరిచిన కేసులో ఇద్దరు టీడీపీ మహిళా ఎంపీటీసీలు, మరో ముగ్గురు
దేవరపల్లి : దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా ఈ నెల 4న ఎన్నికల అధికారి విధులను ఆటంకపరిచిన కేసులో ఇద్దరు టీడీపీ మహిళా ఎంపీటీసీలు, మరో ముగ్గురు పార్టీ నాయకులకు కొవ్వూరు న్యాయస్థానం శనివారం రిమాండ్ విధించినట్టు స్థానిక ఎస్సై ఆర్.శ్రీను శనివారం చెప్పారు. ఆయన కథనం ప్రకారం ఈ నెల 4న మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక జరుగుతుండగా టీడీపీ మండల అధ్యక్షుడు సుంకర దుర్గారావు, టీడీపీ నాయకులు కాట్రగడ్డ శ్రీనివాస్ చౌదరి, ఉప్పునూరు రాంబాబు, మహిళా ఎంపీటీసీలు చింతపల్లి నాగమణి, బి.ఇందిర మరికొంత మంది టీడీపీ నాయకులు దాడి చేసి తన విధులకు ఆటంకపరిచినట్టు ఎన్నికల అధికారి ఎంవీ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కొవ్వూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. అనంతరం వీరిని కొవ్వూరు సబ్‌జైలుకు తరలించినట్టు తెలిపారు.