టీడీపీకి మాగుంట గుడ్‌ బై

TDP MLC Magunta Srinivasulu Reddy Join To YSRCP - Sakshi

ఎమ్మెల్సీ పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా

వైఎస్‌ జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా

విలేకరుల సమావేశంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి వెల్లడి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో అధికార పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీకి గుడ్‌ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను కౌన్సిల్‌ చైర్మన్‌తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావులకు పంపారు. ప్రజలు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నట్లు చెప్పారు. గురువారం ఒంగోలులోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాగుంట ఈ వివరాలు వెల్లడించారు.

రాజన్న పాలన మళ్లీ రావాలి..
రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాజన్న పాలన తిరిగి వస్తుందని మాగుంట చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. తమ కుటుంబానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఎనలేని అనుబంధం ఉందన్నారు. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి, వదిన మాగుంట పార్వతమ్మలు వైఎస్‌తో కలిసి పనిచేశారని, వారి వారసుడిగా తాను కూడా వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు మాగుంట చెప్పారు.

మాగుంట బ్రాండ్‌.. ప్రకాశం
ప్రకాశం జిల్లాలో మాగుంట బ్రాండ్‌ అని, మాగుంట సుబ్బరామిరెడ్డిని జిల్లా ప్రజలు భగవంతుడిగా చూశారని శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. అందరూ తమ వెన్నంటే ఉన్నారన్నారు. ఒంగోలు వదలొద్దని, టీడీపీని వీడి వైఎస్సాసీపీలో చేరాలని ప్రజలు, శ్రేయోభిలాషులు అందరూ కోరినందునే వైఎస్‌ జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ప్రకాశం జిల్లా మాగుంటకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతమన్నారు. పార్టీలకతీతంగా జిల్లాలో మాగుంట కుటుంబం సేవ చేసిందన్నారు. అందరూ తమను ఆదరించారన్నారు. ఎవరి బెదరింపులతోనో పార్టీ మారడం లేదన్నారు.విలేకరుల సమావేశంలో మాగుంటతో కలిసి ఆయన అనుచరులు ఘనశ్యామ్, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, ఐనాబత్తిన సత్యంతో పాటు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా సంబరాలు
ప్రకాశం జిల్లాలో సుధీర్ఘ కాలంగా రాజకీయం నెరుపుతున్న మాగుంట శ్రీనివాసులురెడ్డి అధికార టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు గురువారం ప్రకటించగానే మాగుంట అనుచర వర్గంతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నాయి. మాగుంట రాకతో జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. గత కొంతకాలంగా మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీని వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగినప్పటికీ జాప్యం జరగడంతో అందరూ మాగుంట నిర్ణయం కోసం ఎదురు చూశారు.
ఎట్టకేలకు ఆయన వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మాగుంట టీడీపీకి రాజీనామా చేయడం జిల్లా వ్యాప్తంగా గురువారం చర్చనీయాంశమైంది. ఇక జిల్లాలో వైఎస్సార్‌ సీపీ తిరుగులేని ఆధిక్యతను సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. మాగుంట రాకతో జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలో చేరనుంది. దీంతో 12 అసెంబ్లీ, మూడు పార్లమెంటు నియోజవర్గాల పరిధిలో వైఎస్సార్‌సీపీ విజయావకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

వైఎస్సార్‌ సీపీలో మరింత జోష్‌
ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీకి రాజీనామా చేసి ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనుండడంతో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలో మరింత జోష్‌ నిండింది. మాగుంటకు జిల్లా వ్యాప్తంగా బలమైన వర్గం ఉండడంతో ఇది వైఎస్సార్‌ సీపీకి కలిసి వచ్చే అంశంగా మారింది. ఇప్పటికే కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, పర్చూరుకు చెందిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో పాటు పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో ఆపార్టీళో రెట్టించిన ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమవగా అధికార పార్టీ నేతలు వరుస పెట్టి పార్టీని వీడుతుండడంతో టీడీపీ డీలా పడిపోయింది.

మాగుంట రాజకీయ ప్రస్థానం
నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారింది. 1991లో మాగుంట సుబ్బరామిరెడ్డి ఒంగోలు పార్లమెంటుకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి డేగా నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. ఆతర్వాత 1995 డిసెంబర్‌లో నక్సల్స్‌ కాల్పుల్లో మాగుంట మరణించారు. అనంతరం 1996 ఏప్రిల్‌లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ టీడీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిపై విజయం సాధించారు. 1998 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1999లో టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో మాగుంట శ్రీనివాసులురెడ్డి ఓటమి చవి చూశారు.

2004 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. తర్వాత 2009 ఎన్నికల్లో మాగుంట కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్యపై గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో మాగుంట ఓటమి చెందారు. మొత్తంగా 5 సార్లు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి మాగుంట మూడు సార్లు విజయం సాధించి రెండుసార్లు ఓటమి చెందారు. సామాజిక సేవలోనూ మాగుంట కుటుంబం ముందుంటుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా మాగుంటకు ప్రత్యేక వర్గం ఏర్పడింది. తాజాగా ఆయన వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పార్టీకి ఇది కలిసి వచ్చే అంశం అయింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top