మళ్లీ చంపుతామని బెదిరిస్తున్నారు..! | TDP Leaders Threats to People in Guntur | Sakshi
Sakshi News home page

మళ్లీ చంపుతామని బెదిరిస్తున్నారు..!

Apr 16 2019 1:26 PM | Updated on Apr 16 2019 1:26 PM

TDP Leaders Threats to People in Guntur - Sakshi

జీజీహెచ్‌ మార్చురీ వద్ద ధర్నా చేస్తున్న నెక్కల్లు మృతుల బంధువులు (ఇన్‌సెట్‌) నెక్కల్లు ఘటనలో మృతురాలు వీరా కుమారి

గుంటూరు ఈస్ట్‌:  తుళ్ళూరు మండలం నెక్కల్లు గ్రామంలో ఈనెల 5వతేదీన కారుతో తొక్కించిన ఘటనలో చికిత్స పొందుతున్న వీరకుమారి సోమవారం మృతిచెందిన నేపథ్యంలో ఆమె  బంధువులు, బీసీ సంఘ నాయకులు జీజీహెచ్‌ మార్చురీ వద్ద ధర్నా చేశారు. ఘటన జరిగిన రోజు మహాలక్ష్మి అనే వృద్దురాలు మృతి చెందగా ఆమె కోడలు వీరకుమారి (35) నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో పోస్టుమార్టమ్‌ నిమిత్తం మార్చురీ వద్దకు తీసుకువచ్చారు. ధర్నా సందర్బంగా అఖిలభారత యాదవ సంఘ మండల అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు ఆలూరి సుధాకర్‌  దారి వివాదంలో ఈనెల 5వ తేదీన కారుతో స్థానిక యాదవ సంఘీయులను ఢీకొట్టారన్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా ఘటన జరిగిన రోజే వృద్ధ మహిళ  మహాలక్ష్మి మృతి చెందిందని, ఇప్పుడు ఆమె కోడలు వీరకుమారి చికిత్స పొందుతూ మృతి చెందిందని చెప్పారు.

వీర కుమారి ఆమె ఇద్దరు సంతానం గోపి, శ్రీలత తల్లిని కోల్పోయి అనాథలయ్యారన్నారు. నిందితులు కేవలం అధికార పార్టీ అండ చూసుకునే అహంకారంతో ఈ  దుర్మార్గానికి ఒడిగట్టారన్నారు. అగ్రకులం వారమనే అహంకారంతో బలహీన వర్గాలకు చెందిన తమపై ఈ దాష్టీకానికి తెగబడ్డారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చెందిన చెరువు అక్రమంగా పూడ్చి కబ్జా చేయడమే కాక ఆ చెరువుకు వెళ్లే దారి విషయంలోనూ స్థానికులతో టీడీపీ నాయకులైన సుధాకర్‌ అతని తండ్రి బ్రహ్మయ్య, అనుచరులు గొడవ పెట్టుకున్నారని చెప్పారు. బాధిత కుటుంబాలు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరి వెళ్తుండగా సుధాకర్, బ్రహ్మయ్య కారు స్టార్ట్‌ చేసి బాధితుల మీదకు పోనిచ్చారన్నారు.ఈ ఘటనతో తాము జమీందారీ పాలనలో  బతుకుతున్నామా లేక  ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు.

నిందితులందరినీ తక్షణం అరెస్టు చేయాలి
 ఇంత ఘోరం జరిగి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయినా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు కొంచెమైనా భయపడకుండా, సిగ్గులేకుండా మరోసారి కారుతో తొక్కించి చంపేస్తామంటూ తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు తప్పించుకు తిరుగుతున్న నిందితులందరిని అరెస్టు చేసి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. ప్రభుత్వం నిందితుల పట్ల కఠినంగా ప్రవర్తించి ఉంటే తిరిగి బెదిరింపులకు దిగేందుకు సాహసం చేసేవారు కాదన్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటడం వలనే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలపై దాడులు ఆపకపోతే తాము తిరగబడతామని హెæచ్చరించారు. పసుపులేటి స్థానికబాబు, సంబయ్య, భూపతి, గ్రామస్తులు నిరసన తెలియచేసిన వారిలో ఉన్నారు.  తుళ్ళూరు  సీఐ శ్రీకాంత్‌బాబు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశామని త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేస్తామని ఆందోళనకారులకు  హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement