అవి‘నీటి’ గూళ్లు! | TDP Leaders Corruption in House Construction in PSR Nellore | Sakshi
Sakshi News home page

అవి‘నీటి’ గూళ్లు!

Dec 6 2019 1:18 PM | Updated on Dec 6 2019 1:18 PM

TDP Leaders Corruption in House Construction in PSR Nellore - Sakshi

జనార్దన్‌రెడ్డి కాలనీలో నిర్మించిన అపార్ట్‌మెంట్ల సముదాయం

షీర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మించిన అపార్ట్‌మెంట్లు అవి‘నీటి’ గూళ్లుగా మారాయి. ఓ మోస్తరు వర్షానికి నగరంలోని 54వ డివిజన్‌ జనార్దన్‌రెడ్డి కాలనీలో నిర్మించిన హౌస్‌ ఫర్‌ ఆల్‌ అపార్ట్‌మెంట్ల భవనాలు పగుళ్లిచ్చి, వర్షపు నీరు ఉరుస్తున్నాయి. వర్షం ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు కురిస్తే అపార్ట్‌మెంట్ల పరిస్థితి ఏ విధంగా తయారవుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని ఆ నాడే ‘సాక్షి’ హెచ్చరించింది. వైఎస్సార్‌సీపీ నాయకులు సైతం టీడీపీ నేతల దోపిడీని వెలుగెత్తి చాటారు. ఇసుక తరలింపు నుంచి ఇళ్ల కేటాయింపుల వరకూ అడుగడుగునా టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచేశారు.

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): హౌస్‌ ఫర్‌ ఆల్‌ పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలకు అపార్ట్‌మెంట్లు అద్దం పడుతున్నాయి. అత్యాధునిక  ‘షీర్‌వాల్‌’ సాంకేతిక విధానంలో పక్కా ఇళ్లు నిర్మిస్తున్నామని అప్పటి టీడీపీ పెద్దలు గొప్పలు చెప్పారు. మలేసియా దేశానికి చెందిన ఈ టెక్నాలజీతో అద్భుతంగా వీటిని నిర్మిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ‘మేడి పండు చూడు మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడు పురుగులుండు..’ అనే చందంగా ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి. బయట నుంచి చూసేందుకు అందంగా కనిపిస్తున్నా లోపల అంతా నాసిరకమే. నిర్మాణాలు పూర్తయి సంవత్సరం కాకుండానే ఉరుస్తున్నాయి. నిర్మాణాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతల అవినీతికి ఆనవాళ్లుగా నిలిచిన ఈ గృహ నిర్మాణాలను పరిశీలిద్దాం.
  నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటేశ్వరరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి, కొండ్లపూడి ప్రాంతాల్లో 373.19 ఎకరాల విస్తీర్ణంలో 34,032 పక్కా ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నేతలు పక్కా ఇళ్ల పేరుతో ఓటర్లకు ఎర వేశారు. వెంకటేశ్వరపురం సమీపంలోని పెన్నాతీరం ప్రాంతంలోని జనార్దన్‌రెడ్డి కాలనీలో జరిగే 4,800 ఇళ్ల నిర్మాణాలను మాత్రమే హడావుడిగా, నాసిరకంగా పూర్తి చేసి ఎన్నికల ముందే పేదలకు కట్టబెడుతున్నట్లు మాజీ సీఎం చంద్రబాబు హంగామా చేశారు. అయితే నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల అస్మదీయులు ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డికాలనీలో పేదల కోసమని నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్ల సముదాయంలో చాలా మంది లబ్ధిదారులు పచ్చచొక్కా నాయకులు, వారి అనుచరగణానికే దక్కాయి. మొత్తం 4,800 గృహాలకు 150 అపార్ట్‌మెంట్లు నిర్మించారు. వీటిలో 3,424 సింగిల్‌ బెడ్‌రూం భవనాలు (300 చదరపు అడుగులు), 352 సింగిల్‌ బెడ్‌రూం (365 చదరపు అడుగులు) భవనాలు, 1,024 డబుల్‌ బెడ్‌రూం (430 చదరపు అడుగులు) ఉన్నాయి. వీటిని టిట్కో అనే ప్రైవేట్‌ సంస్థ నిర్మించింది.

చిన్నపాటి వర్షానికి శ్లాబులు పగుళ్లిచ్చి వర్షపునీరు కారుతున్న దృశ్యాలు 
అంతా దోపిడీనే
అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అప్పటి మార్కెట్‌ ధర ప్రకారం చదరపు అడుగుకు రూ.1,000 ఖర్చు అవుతుంది. సదరు నిర్మాణ సంస్థకు చదరపు అడుగుకు రూ.1,928 చొప్పున అప్పనంగా అప్పగించారు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున సొమ్ము పర్సంటేజీల రూపంలో చేతులు మారిందన్న ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక సరఫరా ఉండేది. ఈ నిర్మాణాలకు సంబంధించి ఇసుకను తరలించే పనులను సైతం అప్పటి టీడీపీ నేతలే పొందారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారు. జనార్దనరెడ్డి కాలనీలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ల్లో గృహ ప్రవేశాలు జరగక ముందే శ్లాబులు ఉరుస్తూ, వర్షపు నీరు కారుతున్నాయి. ఉండటాన్ని చూస్తుంటే ఈ నిర్మాణాల్లో ఏ మేర అవినీతి జరిగిందో తెలుసుకోవచ్చు. షీర్‌వాల్‌ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఇళ్లను చూస్తుంటే భయమేస్తోందని లబ్ధిదారులు అంటున్నారు. ఎన్నికల కోడ్‌ రావడంతో కేటాయింపులు నిలిచి పోయాయని, ఆ రకంగా తాము బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు.

మరమ్మతులు చేపడతాం
టిట్కో పీడీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించా. వెంకటేశ్వరపురంలోని జనార్దన్‌రెడ్డికాలనీ వద్ద  నిర్మించిన అపార్ట్‌మెంట్లలో కొన్ని వర్షానికి ఉరుస్తున్నాయనే విషయం తెలియదు. వచ్చే నెల్లో ఈ ప్రాంతంలో కొన్ని నిర్మాణ పనులను చేపట్టే క్రమంలో ఉరుస్తున్న అపార్ట్‌మెంట్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేపడతాం.           – ఆరిఫ్, టిట్కో పీడీ

ఇలా ఉంటాయనేతీసుకునేందుకు భయపడ్డా
గత ప్రభుత్వంలో జనార్దన్‌రెడ్డికాలనీలో పేదల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్లలో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇల్లు కూడా మంజూరైంది. అయితే నాణ్యతపరంగా అనుమానాలు తలెత్తడంతో వద్దనుకున్నా.  – జ్యోత్స్నరెడ్డి

అవినీతి కనిపిస్తోంది
గత టీడీపీ హయాంలో నాణ్యత ప్రమాణాలను పాటించకుండా అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విషయమై గతంలోనే చాలా మంది ప్రశ్నించారు. చిన్నపాటి వర్షానికే ఉరుస్తున్నాయంటే నిర్మాణ పనుల్లో ఏ మేరకు అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు.– వెంకటేశ్వర్లు, జనార్దన్‌రెడ్డి కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement