గ్రామ వలంటీర్‌పై హత్యాయత్నం 

TDP Leader Son Attack On Grama Volunteer In Kurnool - Sakshi

టీడీపీ నాయకుడి కుమారుడి అఘాయిత్యం

తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

కర్నూలు జిల్లాలో ఘటన  

సాక్షి, తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకుడి కుమారుడు పిడిబాకుతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రామంలోని రాముల దేవాలయం సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఉన్న వలంటీర్‌ రామానాయుడిపై టీడీపీ నాయకుడు దబ్బల రామాంజిని కుమారుడు సతీష్‌ ఒక్కసారిగా పిడిబాకుతో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలై రక్తపుమడుగులో రామానాయుడు కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు 108 వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సతీష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తుగ్గలి ఏఎస్‌ఐ మాధవస్వామి తెలిపారు. నిందితుడు సతీష్‌ డోన్‌లోని డిగ్రీ కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నాడు. నవశకం కార్యక్రమంలో భాగంగా వలంటీర్‌ రామానాయుడు కూడా ఇంటింటి సర్వే చేశాడు. ఆ సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో తన పేరు లేకుండా చేశావంటూ సతీష్‌ 20 రోజుల క్రితం వలంటీర్‌తో గొడవకు దిగాడు. తాను సర్వే మాత్రమే చేశానని, పేరు తీసేసే హక్కు తనకు లేదని చెప్పాడు. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పేరు ఎలాగూ వచ్చింది. అయినా కక్ష పెంచుకున్న సతీష్‌ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

గ్రామంలో ఉద్రిక్తత
వలంటీర్‌పై హత్యాయత్నం ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో 400 ఓట్లకు పైగా వైఎస్సార్‌సీపీకి మెజార్టీ రావడంతో టీడీపీ వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలవకుండా చేయాలని వారు ప్లాన్‌లో ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడి కుమారుడు గ్రామ వలంటీర్‌పై హత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top