టీడీపీ నేత అత్యుత్సాహం!

TDP leader Controversial Comments On UB industry management  - Sakshi

యూబీ పరిశ్రమ యాజమాన్యంపై ఎన్‌ఈఆర్‌ అనుచిత వ్యాఖ్యలు

పరుష పదజాలంతోబెదిరింపులు

పరిశ్రమ ఎదుట గందరగోళం సృష్టించిన వైనం

టీడీపీ నేత తీరుపై పరిశ్రమ యాజమాన్యం అసహనం

రణస్థలం: సాధారణంగా ప్రజా ప్రతినిధి కార్మికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పరిశ్రమల యాజమాన్యాలతో సామరస్యంగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించడం సంప్రదాయం. కానీ ఓ టీడీపీ నేత అందుకు భిన్నంగా వ్యవహరించారు. మండల పరిధిలోని బంటుపల్లి వద్ద ఉన్న యూనైటేడ్‌ బ్రేవరీస్‌ పరిశ్రమ ఎదుట   అధికార పార్టీ నాయకుడు నడుకుదిటి ఈశ్వరరావు చేపట్టిన దీక్ష విమర్శలకు తావిస్తోంది.

 దీక్ష సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఒకవైపు కార్మికులను అయోమయంలోకి నెట్టేయడమే కాకుండా మరోవైపు యాజమాన్యం నుంచి అసహనం వ్యక్తమయ్యేలా చేసింది. శనివారం దీక్ష చేపట్టిన ఆయన కొంత సేపటి వరకు పరిశ్రమ యాజమాన్యాన్ని పొగుడుతూ, ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పురుష పదజాలంతో తిడుతూ కనిపించారు. మరికొంత సేపట్లో ఎన్‌ఈఆర్‌ అత్యుత్సాహం చూపారు. పరిశ్రమ యాజమాన్యాన్ని రాయలేని పదజాలంతో తిడుతూ ఒకానొక సందర్భంలో దౌర్జన్యాన్ని ప్రదర్శించారు. ఎన్‌ఈఆర్‌ తీరుపట్ల పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. 

దీక్షకు దిగిన టీడీపీ నేతను శాంతింపజేసేందుకు పోలీసులు  ప్రయత్నించినప్పటికీ ససేమిరా అంటూ రాత్రి కూడా శిబిరంలోనే దీక్షను కొనసాగించారు. యాజమాన్యం తీరుపై తీవ్రంగా చిందులేశారు. యూబీ పరిశ్రమ మా గ్రామానికే సొంతమని, నా చెప్పు చెతుల్లోనే పరిశ్రమ ఉండాలని, నేను చెప్పినట్టే యాజమాన్యం నడుచుకోవాలని షరతులు విధించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎలాంటి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా వినకూడదని, ఒకవేళ వింటే నా ప్రతాపాన్ని చవిచూడాల్సి వస్తుందని యాజమాన్యాన్ని ప్రత్యక్షంగానే ఎన్‌ఈఆర్‌ హెచ్చరించారు. దీంతో కార్మికులు సైతం టీడీపీ నేత తీరుని తప్పుబట్టారు. 

పరిశ్రమ యాజమాన్యం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. నాయకుడంటే కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు మధ్య మంచి వాతావరణం కల్పించేలా మెలగాలని.. కానీ ఎన్‌ఈఆర్‌ అలా వ్యవహరించలేదని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. ఎన్‌ఈఆర్‌ వ్యవహరించిన తీరు యాజమాన్యం, కార్మికుల మధ్య వాతావరణాన్ని వేడిక్కించేలా ఉందని కొంతమంది వ్యాఖ్యానించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top