
ఆత్మకూరు : అధికార దర్పంతో టీడీపీ నేతలు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. ఈసారి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై టీడీపీ నేత ఒకరు తహశీల్దార్ కార్యాలయంలోనే దుర్భాషలకు దిగటంతోపాటు భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు వద్దన్న ఆర్‌ఐ
ఆత్మకూరు చేనేత కాలనీలో ప్రభుత్వానికి చెందిన స్థలంలో కొందరు టీడీపీ నేతల మద్దతుతో ప్రార్థనాలయాన్ని నిర్మిస్తుండటంపై అభ్యంతరం తెలిపిన స్థానికులు తహసీల్దార్ సీహెచ్ సుబ్బయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఆదేశాల మేరకు అక్కడకు వెళ్లిన ఆర్‌ఐ షేక్ జహీర్.. ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దని వారికి సూచించారు. త్వరలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నందున ఈ నిర్మాణాన్ని తొలగించాల్సి వస్తుందని చెప్పారు. రోడ్డు విస్తరణకు అడ్డు వస్తున్నందున పనులను నిలిపివేయాలని కోరారు. అయితే అక్కడున్నవారు వెంటనే టీడీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐవీ రమణారెడ్డికి ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడాలంటూ ఫోన్ ఇవ్వబోగా అందుకు నిరాకరించిన ఆర్‌ఐ నిర్మాణాలు చేపట్టవద్దని హెచ్చరించి వెళ్లిపోయారు.
భౌతిక దాడికి దిగిన రమణారెడ్డి
అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ నేత రమణారెడ్డి.. ‘స్థలాన్ని చూసేందుకు వచ్చింది నువ్వేనా? నాతో ఫోన్‌లో ఎందుకు మాట్లాడలేదు..?’ అంటూ దుర్భాషలకు దిగి ఆగ్రహంతో ఊగిపోతూ ఆర్‌ఐ చెంపపై కొట్టారు. పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శేషయ్య, వీఆర్‌ఓ కేశవమూర్తులు ఆయన్ను వారించి పక్కకు పంపించారు. అధికార పార్టీ నేతలు ఇలా దాడులకు పాల్పడితే విధులు ఎలా నిర్వహించాలని రెవెన్యూ సిబ్బంది తహశీల్దార్ వద్ద వాపోయారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.