జిల్లాలో శంకుస్థాపనల గోల..!

TDP Groundbreakings Without Funds in Vizianagaram - Sakshi

నిధులు మంజూరు కాకుండానే ఉత్తుత్తి శంకుస్థాపనలు!

పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవాలు

అంతా ఎన్నికల మాయాజాలం

ఏదో చేసేస్తున్నామని చెప్పేందుకు టీడీపీ నేతల తంటాలు...

నాలుగేళ్ల తొమ్మిదినెలలు ఎటువెళ్లిపోయారంటూ గుసగుసలు

టీడీపీ ప్రభుత్వ తీరును చూసి నవ్వుకుంటున్న జనం

విజయనగరం ,సాలూరు: ఎగురుతున్న పిట్టకు మసాలా నూరేస్తున్న చందంగా ఉంది అధికారపార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దల తీరు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు కాకుండానే హడావుడిగా శంకుస్థాపనులు చేస్తుండడం, భవన నిర్మాణ పనులు పూర్తికాకుండానే ప్రారంభోత్సవాలు చేస్తుండడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఈ మసాలా నూరేయడం అంటూ గుసగుసలాడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు ఎలాఉన్నా... ఇప్పుడు ఎంతో చేసేస్తున్నామన్న అభిప్రాయం కల్పించి, రానున్న ఎన్నికల్లో ప్రజల ఓట్లను కొల్లగొట్టాలన్న లక్ష్యంతో టీడీపీ పెద్దలు ముందుకు సాగుతున్నారన్న చర్చ జోందుకుంది.

నిధులు మంజూరుకాకుండానే..
సాలూరు ప్రాంతవాసుల చిరకాలవాంఛ 100 పడకల ఆస్పత్రి. దీనిని నిర్మాణానికి ఈనెల 15న రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తదితరులు శంకుస్థాపన చేసేశారు. ఆస్పత్రి నిర్మాణానికి రూ.17 కోట్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అదనపు భవనాలు, స్మార్ట్‌ తరగతి గదులు, ఇతర మౌలిక  సదుపాయాల కోసం రూ.4 కోట్లు మంజూరైనట్టు మంత్రి ప్రకటించారు. అయితే, సంబంధిత పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండానే శంకుస్థాపనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 100 పడకల ఆస్పత్రి శంకుస్థాపనకు రావాలని ఎమ్మెల్యే రాజన్నదొరను ఆహ్వానించేందుకు వెళ్లిన ఆస్పత్రి వైద్యుడిని నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందా..? అన్ని ప్రశ్నిస్తే సదరు వైద్యుడి నోటివెంట మాట రాలేదని సమాచారం. నిధులు మంజూరు చేయకుండా ఎలా శంకుస్థాపణలు చేస్తారని, అడ్డుగోలు పనులకు నేనెప్పుడైనా మద్దతు తెలిపానా? ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించడంతో చేసేదిలేక ఆ వైద్యుడు వెనుదిరిగినట్టు తెలిసింది. అలాగే, సాలూరు మండలంలోని కందులపదం గెడ్డవద్ద వంతెన నిర్మాణానికి ఎమ్మెల్సీ సంధ్యారాణి, భంజ్‌దేవ్‌ జరిపిన భూమిపూజది కూడా ఇదే తంతు కావడం గమనార్హం. సాలూరు పట్టణంలోని ఐసీడీఎస్‌ అర్బన్‌ కార్యాలయం భవన నిర్మాణం పూర్తికాకుండానే ప్రారంభోత్సవం జరిపించారు. పై అంతస్తు భవనం పనులు ఇంకా జరగాల్సి వుంది. అలాగే, దండిగాం మార్గంలో నిర్మించిన రైతు బజారుదీ అదే పరిస్థితి. కార్యాలయ భవనంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా హడావుడిగా ప్రారంభోత్సవాలు జరపడం విశేషం.

ఎన్నికల కోడ్‌ వచ్చేస్తుందనే...
ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేస్తుంది. నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీంతో ప్రజలు తిరగబడుతున్నారు. ఈ మరకలను తొలగించుకునేందుకు నిధులు మంజూరు కాకపోయినా శంకుస్థాపనలు చేసేస్తున్నట్టు సమాచారం. పదవీకాలంలో ఉన్నన్నాళ్లూ మంజూరైన పనులు పూర్తిచేయాలన్న ధ్యాస,  ప్రజలు కోరుతున్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరుచేయాలన్న ఆలోచన చేయని పాలకులు.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న తరుణంలో ప్రజలను ఏమార్చేందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

నిబంధనలు ఇలా...
ప్రభుత్వం ఏ అభివృద్ధి పనిని ప్రారంభించాలన్నా.. ముందుగా నిధులకు సంబంధించిన అంచనాలను నిపుణులు రూపొందిస్తారు. ఆపై దాన్ని ఆమోదించిన అనంతరం ప్రభుత్వం నిధులను మంజూరుచేస్తూ జీఓ జారీ చేస్తుంది. ఆపై సంబంధిత పనులకు సంబంధించిన టెండర్లను పిలుస్తారు. టెండర్లను కాంట్రాక్టర్‌ దక్కించుకున్న తర్వాత వర్క్‌ ఆర్డర్‌ ఇస్తారు. అనంతరం సంబంధిత పనులకు సంబంధించి శంకుస్థాపన జరపాల్సి ఉంది. అయితే, ఇవేవీ జరగకుండానే నేరుగా శంకుస్థాపన చేసేస్తుండడంలో ఉద్దేశం ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు దండుకోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మోసం చేస్తూనే ఉన్నారు...
టీడీపీ నేతలు అధికారం చేపట్టింది మొదలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మేరకు మాఫీ చేశారో అందరికీ తెలిసిందే. ఇదే తీరును పదవీకాలం మొత్తం పూర్తి చేశారు.  గద్దెదిగే సమయంలో కూడా అదే మోసపూరిత వైఖరిని అనుసరిస్తున్నారు. నిధులు మంజూరు చేస్తూ జీఓ విడుదల కాకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇది ప్రజలను వంచించడమే. అందుకే చాలా స్పష్టంగా చెబుతున్నాం. భూమిపూజ చేసిన పనులు పూర్తి చేయకపోతే చీటింగ్‌ కేసు పెడతాం.
– పీడిక రాజన్నదొర, ఎమ్మెల్యే, సాలూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top