మొక్క మాటున మెక్కేశారు! | TDP Government Corruption in Neeru Chettu Programme | Sakshi
Sakshi News home page

మొక్క మాటున మెక్కేశారు!

Sep 13 2019 11:51 AM | Updated on Sep 13 2019 11:51 AM

TDP Government Corruption in Neeru Chettu Programme - Sakshi

జాతీయ ఉపాధి హామీ (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేయడంతో రైతులు ఎంతో సంతోషించారు. కానీ జిల్లాలో ఈ పథకం అభాసుపాలైంది. టీడీపీ హయాంలో అర్హులను పక్కనపెట్టి టీడీపీ మద్దతుదారులైన రైతులకే పథకం వర్తింపజేశారు. రికార్డుల్లో మొక్కలు చూపి రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇటీవలే నియోజకవర్గంలో సామాజిక తనిఖీలు ప్రారంభం కాగా.. మొక్కమాటున టీడీపీ నేతలు మెక్కేసిన నిధులు ఎంతనేది వెలుగుచూడనుంది. – శింగనమల

అనంతపురం,శింగనమల : టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతి పథకంలోనూ దోపిడీ సాగింది. చివరకు వలసలు నివారించి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధి హామీ సొమ్మునూ టీడీపీ నేతలు స్వాహా చేసేశారు. ఇందుకోసం ఉద్యానపంటల సాగుకు అడ్డు పెట్టారు. 2017–18, 2018–19 సంవత్సరాల్లో  నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. అర్హులైన రైతులు దరఖాస్తు చేస్తున్నా...అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు కేవలం టీడీపీ సానుభూతిపరులైన రైతులను మాత్రమే ఎంపిక చేశారు. వారు పండ్లు మొక్కలు నాటకపోయినా బిల్లులు మాత్రం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగానే శింగనమల మండలంలోనే భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మండల వ్యాప్తంగా సామాజిక తనిఖీ జరుగుతుండగా...అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తాయని స్థానిక రైతులు చెబుతున్నారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా విచారణ చేపడితే రూ.కోట్లు దుర్వినియోగమైన తీరు తెలుస్తుందంటున్నారు.

రికార్డుల్లోనే మొక్కలు...
శింగనమల గ్రామ పంచాయతీలో 2017–18 సంవత్సరంలో 8 మంది రైతులకు ఉపాధిహామీ పథకం కింద పండ్లతోటల పెంపకానికి అనుమతులిచ్చారు. అయితే సదరు రైతులు పండ్ల మొక్కలు నాటకుండానే రూ. 7.31 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపారు. అలాగే 2018–19 సంవత్సరానికి ఏడు మంది రైతులు పండ్ల తోటలు పెంపకం చేపట్టినట్లు రూ. 3.19 లక్షలు ఖర్చు చూపి బిల్లులు చేసుకున్నారు. ఇలా నియోజకవర్గంలోని 18 పంచాయతీల్లో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. 

రెండేళ్లలో రూ.4.01 కోట్లు
శింగనమల మండలంలోని శింగనమల, సోదనపల్లి, మట్లగొంది, సలకంచెరువు, నాయనవారిపల్లి, రాచేపల్లి, నిదనవాడ, తరిమెల, కల్లుమడి, గుమ్మేపల్లి, ఆకులేడు, లోలూరు, వెస్ట్‌ నరసాపురం, చక్రాయిపేట, పెరవలి, జూలకాల్వ, కొరివిపల్లి, ఉల్లికల్లు గ్రామ పంచాయతీల్లో 159 మంది రైతులు 2017–18 సంవత్సరంలో దాదాపు 413 ఎకరాల్లో పండ్ల తోటలు సాగుచేసినట్లు రికార్డుల్లో చూపారు. గుంతలు తీయడం...మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోయడం, మొక్కలు మధ్యలో గడ్డి తొలగించడం, ఎరువులు ఇలా అన్నింటికీ రూ.1.28 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డుల్లో చూపి బిల్లులు చేసుకున్నారు. ఇక 2018–19 సంవత్సరంలోనూ 463 మంది రైతులు 932 ఎకరాల్లో పండ్ల తోటలు సాగుచేసినట్లు రికార్డులలో చూపి రూ.2.73 కోట్లు బిల్లులు చేసుకున్నారు. ఇలా రెండేళ్లలోనే రూ. 4.01 కోట్లు నిధులు డ్రా చేసుకున్నారు. కానీ ఆ మేరకు మొక్కలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. వెలుగు సిబ్బంది, కొంతమంది టీడీపీ కార్యకర్తలు కుమ్మకై బిల్లులు చేసుకున్నారని ఆరోపణలున్నాయి. వీటిపై రైతులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటం...టీడీపీ మద్దతుదారులై బిల్లులు స్వాహా చేయడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. 

సామాజిక తనిఖీల్లో వెలుగుచూడనున్న అక్రమాలు
ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ పనులపై సామాజిక తనిఖీలు జరుగుతున్నాయి. 8వ తేదీ నుంచి శింగనమల మండలంలోని పలు గ్రామాల్లో అధికారులు సామాజిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోన నేడో, రేపో జాతీయ ఉపాధి హామీ...అమలు చేసిన పథకాలు...లబ్ధిదారులు...ఖర్చు చేసిన మొత్తాన్ని బహిరంగంగా చదివి వినిపించనున్నారు. ఈక్రమంలోనే గతంలో జరిగిన అక్రమాలన్నీ తప్పకుండా వెలుగుచూస్తాయని పలువురు రైతులు చెబుతున్నారు.  

ఒక్కో మొక్క కోనుగోలుకు    : రూ.50
ఎరువులు సంవత్సరానికి 2 సార్లు : రూ.50 (మూడేళ్లు)
నీరు పోసేందుకు నెలకు 4 సార్లు    : రూ.17(మూడేళ్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement