దందాల దాల్‌సూరీ! 

TDP Activist Illegal Activities In Anantapur - Sakshi

పలు రాష్ట్రాల్లో ‘తమ్ముడి’ మోసాలు

ఐదేళ్లలో వందల మందికి టోపీ 

తాజాగా నంద్యాల సబ్‌జైలులో గడుపుతున్న వైనం

మెరిమిశెట్టి సురేష్‌కుమార్‌ అలియాస్‌ దాల్‌మిల్‌ సూరి. దందాలకు...మోసాలకు కేరాఫ్‌ అడ్రస్‌. మాటలతో మభ్యపెట్టడం. రూ.కోట్లు కొట్టేయడం ఇతనికి వెన్నతోపెట్టిన విద్య. టీడీపీ హయాంలో భార్య జెడ్పీటీసీ సభ్యురాలిగా పనిచేయగా... అధికారం అడ్డుపెట్టుకుని ఎందరినో మోసం చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు తీసుకుని తప్పించుకు తిరిగాడు. ఎవరికైనా ఎదురుపడినా మాటలతో తప్పించుకుంటాడు. ఇలా ఎందరికో మస్కా కొట్టిన అతను ...ఇప్పుడు ఓ కేసులో నంద్యాల సబ్‌జైలులో ఊచలులెక్కిస్తున్నాడు. ఈ విషయం ప్రసార మాధ్యమాల్లో చూసిన బాధితులు ఒక్కొక్కరుగా కొత్తచెరువు పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు.          
– కొత్తచెరువు 

సాక్షి, అనంతపురం : మెరిమిశెట్టి సురేష్‌కుమార్‌ కొత్తచెరువులోని ధర్మవరం రోడ్డులో శ్రీవెంకటేశ్వర గ్లోబుల్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మిల్‌ ఏర్పాటు చేశాడు. తన పేరుతో వివిధ ప్రాంతాల్లో దాల్‌మిల్లులు ఉన్నాయంటూ మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల రైతులు, వ్యాపారుల నుంచి బియ్యం, బేడలు, చక్కెర, వడ్లు, వేరుశెనగ, మెక్కజొన్న తదితర వాటిని కొనుగోలు చేయడం...వాటిని ఇతరులకు విక్రయించడం ఇతని వ్యాపారం. అన్నీ బాగానే ఉన్నా...రైతుల నుంచి సరుకు తీసుకునే దాల్‌మిల్‌ సూరి ఆ తర్వాత వారికి డబ్బులు ఎగ్గొట్టేవాడు. అదే విధంగా కొన్ని ఫ్యాక్టరీలకు ముడిసి సరుకు సరఫరా చేస్తానని అడ్వాన్స్‌గా రూ.లక్షల్లో డబ్బులు తీసుకోవడం... ఆ తర్వాత ఎగ్గొట్టేవాడు. ఇలా ఇప్పటికే ఎందరినో మోసం చేసి రూ.కోట్లు కూడబెట్టాడు. 

టీడీపీ హయాంలో పెచ్చుమీరిన ఆగడాలు 
2014లో తన భార్య మహాలక్ష్మిని టీడీపీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేయించిన సూరి...ఆమె విజయం సాధించడంతో మరింతగా రెచ్చి పోయాడు. అప్పటి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అండతో ఎందరికో మస్కా కొట్టాడు. దీంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినా...అప్పుడు అతనిపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. మరికొందరు మాత్రం అధికార పార్టీ అండ చూసుకుని ఆ మాత్రం ధైర్యం కూడా చేయలేకపోయాడు.  

పదేళ్లలోనే రూ.కోట్లకు ఎదిగిన వైనం 
సాధారణ మధ్యతరగతికి చెందిన దాల్‌మిల్‌ సూరికి ఒకప్పుడు ద్విచక్రవాహనం కూడా ఉండేది కాదు. కానీ పదేళ్లు గిర్రున తిరిగేసరికి అత్యంత విలాసవంతమైన కార్లు కొనుగోలు చేశాడు. తన అనుచరుల పేరుతోనూ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టేవాడు. ఇలా అనుచరులను కూడా మోసం చేశాడు. సూరికి ఓ తమ్ముడు ఉండగా...అతను కూడా అన్నబాటలోనే నడిచాడు. బెంగళూరు, హైదరాబాద్‌లలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలిస్తానని నిరుద్యోగులతో డబ్బులు వసూలు చేసి ఎందరో జీవితాలను నాశనం చేశాడు.   

నంద్యాల సబ్‌జైలులో ఊచలు లెక్కిస్తూ...
దాల్‌మిల్‌ సూరి నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీకి మెటీరియల్‌ అందజేసేందుకు ఫ్యాక్టరీ యజమాని సుజల నుంచి రూ.20 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నాడు. సమయానికి మెటీరియల్‌ సప్లై చేయకపోగా, డబ్బు తిరిగి చెల్లించకపోవటంతో సుజల స్థానిక త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఈనెల 23న అరెస్ట్‌ చేసి ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లావణ్య ఎదుట హాజరుపరిచారు. మెజిస్ట్రేట్‌ 14 రోజులు రిమాండ్‌ విధించగా.. పోలీసులు సబ్‌జైల్‌కు తరలించారు. అక్కడ కడుపునొప్పి అంటూ డ్రామా ఆడిన సూరి...నంద్యాల ప్రభుత్వాస్పత్రి ఐసీయూలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసీ గదిలో సేదదీరాడు. అయితే అదే సమయంలో జైలును తనిఖీ చేసిన మెజిస్ట్రేట్‌ లావణ్య...అక్కడ రిమాండ్‌ ఖైదీ దాల్‌మిల్‌ సూరి లేకపోవడం గమనించి జైలు అధికారులు ప్రశ్నించగా..అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించినట్లు వారు చెప్పారు. దీంతో ఆమె నేరుగా ఆస్పత్రికి వెళ్లి రాజభోగాలు అనుభవిస్తున్న సూరిని చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే సబ్‌జైలుకు తరలించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటన గురించి పత్రికల ద్వారా తెలుసుకున్న దాల్‌మిల్‌ సూరి బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోలీసు స్టేషన్‌ మెట్లెక్కుతున్నారు. అతను చేసిన మోసాల గురించి ఏకరువు పెడుతున్నారు. 

కొత్తచెరువు పీఎస్‌లో నమోదైన కేసులు 
రాజస్తాన్‌కు చెందిన శేఖర్‌ అనే వ్యాపారి నుంచి రూ. 40 లక్షల విలువైన వేరుశనగ కాయలు కొనుగోలు చేసి. రూ.18 లక్షలు మాత్రమే ఇచ్చాడు. మిగతా రూ. 22 లక్షలు ఇవ్వకుండ మోసగించినట్లు సదరు వ్యాపారి 2018లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. జొన్నలు సరఫరా చేస్తానని చెప్పి కోయంబత్తూరుకు చెందిన సెంథిల్‌కుమార్‌ అనే వ్యాపారి వద్ద నుంచి రూ.17 లక్షలు డబ్బులు తీసుకున్న సూరి... జొన్నలు సరఫరా చేయలేదు. దీంతో దాల్‌మిల్‌ సూరి తనను మోసం చేశాడని సెంథిల్‌కుమార్‌ 2019లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

సిరిగుప్ప, బళ్లారికి చెందిన వ్యాపారులు బద్రీనారాయణకు బియ్యం సరఫరా చేస్తానని చెప్పి... అతని నుంచి రూ. 80 లక్షలు తీసుకున్న సూరి..బియ్యం పంపలేదు. దీంతో సదరు వ్యాపారులు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు ఐపీసీ 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కొత్తచెరువు ఆంధ్రాబ్యాంకులో రుణాలు తీసుకుని కట్టకపోవడం...పలువురికి చెక్కులిచ్చి అవి బౌన్స్‌ అయిన ఘటనలపై కూడా దాల్‌మిల్‌ సూరిపై కేసులు నమోదై ఉన్నాయి. 

బాధితులు ఫిర్యాదు చేయవచ్చు 
దాల్‌మిల్‌ సూరి బాధితులు ఎవరైనా సరే కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌లో గాని వారి పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. చట్టప్రకారం కేసు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకుంటాం.  
బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, సీఐ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top