
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు స్మరించారు.
వైభవంగా స్నపనతిరుమంజనం
వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర (పాలు), దధి (పెరుగు), మది (తేనె), నారికేళం (కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం (గంధం)తో స్నపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖానసాగమోక్తంగా చేపట్టారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లు అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.