గవర్నర్‌కా? సీఎస్‌కా? | suspense on Reorganization Bill of Andhra pradesh! | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కా? సీఎస్‌కా?

Dec 11 2013 1:57 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు- 2013 రాష్ట్రానికి ఎప్పుడు వస్తుంది..? వస్తే రాష్ట్రపతి నుంచి నేరుగా ఆ బిల్లు ఎవరి వద్దకు వస్తుంది..?


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు- 2013 రాష్ట్రానికి ఎప్పుడు వస్తుంది..? వస్తే రాష్ట్రపతి నుంచి నేరుగా ఆ బిల్లు ఎవరి వద్దకు వస్తుంది..? అన్న అంశాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి విభజన బిల్లు రాష్ట్రానికి వస్తుందని అధికార కాంగ్రెస్ వర్గాలు అంచనా వేశాయి. ఆ బిల్లు వచ్చిన వెంటనే బుధవారం సాయంత్రం జరిగే బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాగా ఖరారు చేసి మరుసటి రోజు నుంచి చర్చ జరపాలని భావించాయి. కానీ సదరు బిల్లు ఇంకా రాష్ట్రపతి భవన్‌లోనే ఉందని సమాచారం అందటంతో అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోపు బిల్లు వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది.

 

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం రాత్రి స్వదేశానికి తిరిగి వస్తారు. దీంతో.. విభజన బిల్లు ఎప్పుడు వస్తుందనే అంశంపై గురువారం (12వ తేదీ) మాత్రమే స్పష్టత వచ్చే     అవకాశముందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తొలి రోజు తుపాను నష్టంపై చర్చించేందుకు సిద్ధమయ్యారు. బిల్లు రాని పక్షంలో మూడు రోజుల్లోనే సమావేశాలను ముగించాలని సీఎం భావిస్తున్నారు. ఒకవేళ సమావేశాల మధ్యలో బిల్లు వస్తే మాత్రం మరో రెండు, మూడు రోజుల పాటు సమావేశాలను పొడిగించాలని యోచిస్తున్నారు.


 ఎవరికి వచ్చేదీ 12న స్పష్టత..!


 మరోవైపు.. విభజన బిల్లును కేంద్రం ఎవరికి పంపిస్తారనే దానిపైనా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. శాసనసభ వర్గాలు మాత్రం.. బిల్లు రాష్ట్రపతి ద్వారా గవర్నర్‌కు పంపుతారని చెప్తున్నాయి. అయితే.. రాష్ట్రపతి నుంచి నేరుగా రాష్ట్రానికి బిల్లు రావడమన్నది జరగదని.. రాష్ట్రపతి నుంచి మళ్లీ కేంద్ర హోంమంత్రికి వెళుతుందని, అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర హోంమంత్రి నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బిల్లు అందుతుందని.. దాన్ని ఆయన ముఖ్యమంత్రికి పంపిస్తే శాసనసభ నాయకుడిగా సీఎం దాన్ని సభలో ప్రవేశపెడతారని చెప్తున్నాయి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో సీఎం సభలో ప్రవేశపెట్టలేని పరిస్థితి ఎదురైతే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బిల్లును సభలో చర్చకు ప్రతిపాదిస్తారని ఆ వర్గాలు వివరించాయి.

 

అయితే రాజ్‌భవన్ వర్గాలు మాత్రం ఈ విషయంపై స్పష్టత లేదని చెప్తూ.. గతంలో మధ్యప్రదేశ్ పునర్విభజన బిల్లు సందర్భంగా జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తున్నాయి. అప్పుడు రాష్ట్రపతి భవన్ కార్యాలయం విభజన బిల్లును నేరుగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపగా, అక్కడి నుంచి శాసనసభ స్పీకర్‌కు వెళ్లిందని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ ఆ ఫైలును కేంద్రానికి తిప్పి పంపారని పేర్కొన్నాయి. దాంతో కొద్ది రోజుల తరువాత విభజన ఫైలు మళ్లీ గవర్నర్ ద్వారా స్పీకర్‌కు చేరిందన్నారు. ఈ నేపథ్యంలో విభజన బిల్లును ఎవరికి పంపుతారు? ఎప్పుడు పంపుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేద ని తెలిపాయి. ఈ నెల 12న రాష్ట్రపతి భవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement