‘రామకృష్ణ! ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ | Suryanarayana Comments On TDP MLA Ramakrishna | Sakshi
Sakshi News home page

రామకృష్ణపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలి

Apr 26 2019 1:04 PM | Updated on Apr 26 2019 3:58 PM

Suryanarayana Comments On TDP MLA Ramakrishna - Sakshi

చెన్నైకు దొంగ సరుకు రవాణా చేస్తున్నారని, అవినీతి పరుడని..

సాక్షి, విజయవాడ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన బూతు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎమ్మెల్యే రామకృష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఉద్యోగిపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే రామకృష్ణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణ నోరుపారేసుకున్న ఉద్యోగికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రామకృష్ణ చెన్నైకు దొంగ సరుకు రవాణా చేస్తున్నారని, ఆయన అవినీతి పరుడు.. దొంగ వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు పన్ను ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆయన లాగా అవినీతి పరులు కాదన్నారు. రామకృష్ణ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు.

ఎన్నికల్లో అప్పటికప్పుడు 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు. వారందరికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని.. చిత్తూరు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఇద్దరు కలెక్టర్లపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొంత మంది అధికారులు అధికార పార్టీకి తాబేదారుల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారానికి ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవ్వాలని, లేదంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తేల్చిచెప్పారు.

చదవండి: ‘రేయ్‌.. నీ అంతు చూస్తా’ : టీడీపీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement