మెడిసిన్‌లో మెరిసెన్‌ | Srikakulam Suresh Get Ninth Rank in All India PG Medicine | Sakshi
Sakshi News home page

మెడిసిన్‌లో మెరిసెన్‌

Mar 9 2020 12:35 PM | Updated on Mar 9 2020 12:35 PM

Srikakulam Suresh Get Ninth Rank in All India PG Medicine - Sakshi

మేనమామ కనకరాజు, సోదరుడు వెంకటేష్‌తో ఆలిండియా నీట్‌ ర్యాంకర్‌ సురేష్‌

వజ్రపుకొత్తూరు: తల్లి కష్టం ఆ యువకుడు వృథాగా పోనియ్య లేదు..  చిన్నప్పుడే తండ్రిని కిడ్నీ వ్యాధి కబలించగా.. ఆటు పోట్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొని ఆ యువకుడు ముందుకు సాగాడు. తల్లి కష్టార్జితంతో పాటు మేనమామ ప్రోత్సాహంతో చదువులో రాణించి వైద్యుడిగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేశాడు. సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు రాదని నిరూపించి విద్యార్థి లోకానికి స్ఫూర్తిగా నిలిచాడు వజ్రపుకొత్తూరు మండలం పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన దల్లి సురేష్‌. నేషనల్‌  బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ నిర్వహించిన ఆలిండియా పీజీ మెడిసిన్‌(నీట్‌)లో జాతీయ స్థాయిలో 152వ ర్యాంక్‌ , ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలో స్టేట్‌ 9వ ర్యాంక్‌ ఆలిండియా ఓబీసీ కేటగిరిలో 23వ ర్యాంక్‌ సాదించి భళా అనిపించకున్నాడు.

చదువులో చిచ్చరపిడుగు..  
దల్లి సింహాచలం, దయమంతి కుమారుడైన సురేష్‌ ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో ర్యాంక్‌ సాధించేందుకు భావనపాడుకు చెందిన మేన మామ బుడ్డా కనకరాజు కృషి చేశారు.1 నుంచి 7వ తరగతి వరకు పీజేపురం ప్రాథమికోన్నత పాఠశాలలో,  8 నుంచి 10వ తరగతి వరకు కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు పాఠశాల చదివిన సురేష్‌ కాకినాడలో ఇంర్మీడియట్‌ బైపీసీలో 970 మార్కులు సాధించి పూర్తి చేశారు. అనంతరం ఎంసెట్‌లో చక్కటి ర్యాంక్‌ సాధించి అక్కడే ఎంబీబీఎస్‌ను రంగారాయ మెడికల్‌ కళాశాలలో పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన నీట్‌ ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని పీజీలో ఎండీ జనరల్‌ మెడిసిన్‌ ఢిల్లీలోని మౌలానాఅజాద్‌ మెడికల్‌ కళాశాలలో పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. 

ఘనంగా సన్మానం..
సురేష్‌ను టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ కణితివూరులో ఆదివారం ఘనంగా సన్మానం చేసారు.  పేదరికాన్ని జయించి పట్టుదలతో యువ వైద్యుడిగా ఎదగడం విద్యార్థి లోకానికి ఆదర్శమని కొనియాడారు. పీజీని దిగ్విజయంగా పూర్తి చేసి గ్రామీణులకు చక్కటి వైద్య సేవలను అందించాలని కోరారు. కార్యక్రమంలో నందిగాం మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొమ్మాళి లక్ష్మీనారాయణ, కణితి గిరి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు వైద్యసేవలందిస్తా
పట్టుదలతో శ్రమిస్తే ఎవరికైనా విజయం సొంతమవుతుంది. మేనమామ ప్రోత్సాహం, తల్లి పడిన కష్టాన్ని దిగమింగుకుని చదవాను. పీజీ పూర్తి చేసి గ్రామీణ ప్రాంత పేదలకు చక్కటి వైద్యసేవలు అందిస్తాను.   
– దల్లి సురేష్, వైద్య విద్యార్థి, పీజేపురం

ఆనందంగా ఉంది..
తండ్రి మరణించినా కష్టపడి పిల్లలను చదివించాను. ఇందులో నా సోదరుడి పాత్ర కీలకం. పేదరికం, కష్టాలను గమనించి చదివిన పెద్ద కుమారుడు వెంకటేష్‌ ఇడుపులపాయ ట్రిపుల్‌ ఇటీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ అయ్యారు. చిన్నకుమారుడు సురేష్‌ వైద్యుడిగా మారడం ఆనందంగా ఉంది.– దల్లి దమయంతి, తల్లి, పీజేపురం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement