ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలు, హామీలకే పరిమితం అవుతున్నారు. రెండు విడతల రచ్చబండ కార్యక్రమాల్లో వచ్చిన వినతిపత్రాలకు పరిష్కారం చూపని కిరణ్ సర్కారు నవంబర్ 2 నుంచి మూడో విడత రచ్చబండ అంటూ ప్రకటించడం ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తోంది.
సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలు, హామీలకే పరిమితం అవుతున్నారు. రెండు విడతల రచ్చబండ కార్యక్రమాల్లో వచ్చిన వినతిపత్రాలకు పరిష్కారం చూపని కిరణ్ సర్కారు నవంబర్ 2 నుంచి మూడో విడత రచ్చబండ అంటూ ప్రకటించడం ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లినా వెంటనే పరిష్కరించేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా తిరగబడిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్ నేతృత్వంలో 2011 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి విడతగా, ఆదే సంవత్సరం నవంబర్ 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండో విడతగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించారు. వైఎస్సార్ హయాంలో మాదిరిగానే సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన ప్రజలు లక్షల సంఖ్యలో వినతిపత్రాలు సమర్పించారు. రెండు విడతల్లో కలిపి ఒక లక్ష 22 వేల 188 వినతిపత్రాలు వచ్చాయి. మూడేళ్లు గడుస్తున్నా ఆ అర్జీలకు ఇప్పటికీ మోక్షం లేదు. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 70 వేల మందికి కొత్తకార్డులు ఇచ్చారు. ఇంకా 50 వేలకు పైగా కార్డులు ఇవ్వాలి ఉంది. 36,389 మంది పింఛన్ల కోసం వినతిపత్రాలు సమర్పించగా 12,397 మందికి మాత్రమే మంజూరయ్యాయి.
మిగిలిన 23,992 మంది పింఛన్ల కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. రెండు విడతల రచ్చబండల్లో కలిపి 58,601 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్జీలు ఇచ్చారు. ఇప్పటివరకు 16,301 మందికి మాత్రమే ఇళ్లు మంజూరయ్యాయి. పెద్దసంఖ్యలో వికలాంగులు పింఛన్ కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. వికలాంగత్వ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా, ఆ జాబితాలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే మూడో విడత రచ్చబండ అంటూ కిరణ్ సర్కార్ ప్రకటన వదిలింది. గత రచ్చబండల్లో పెండిగ్‌లో ఉన్న సమస్యలను సైతం పరిష్కరిస్తామని ప్రజలను మభ్యపెడుతోంది.
వైఎస్సార్ హయాంలో అందరికీ మేలు
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో పేదల అవసరాలు గుర్తించి అడిగిందే తడవుగా పింఛన్లు, రేషన్‌కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేవారు. ప్రస్తుత కిరణ్ సర్కారు అర్హులకు ఇళ్లు మంజూరు చేయకపోగా, వైఎస్సార్ హయాంలో నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు నిలిపేసింది. సకాలంలో నిర్మాణం పూర్తి చేయలేదంటూ 76 వేల ఇళ్లను రద్దు చేసింది. మరోవైపు గూడు కల్పించాలంటూ రచ్చబండలో వేలాది మంది ఇచ్చిన అర్జీలను బుట్టదాఖలు చేసింది. దీంతో అర్హులైన పేదలకు పక్కా ఇళ్లు దక్కే పరిస్థితి లేకుండా పోయింది.