టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
భిక్కనూరు: మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్.రాజశేఖర రెడ్డిదేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో వడ్డీలేని రుణాలు, చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గడీల పాలన ఉండేదని.. నేడు ప్రజాపాలన ఉందన్నారు.
కేసీఆర్ హయాంలో కేవలం 50 వేల ఉద్యోగాలను మాత్రమే ఇవ్వగా, రేవంత్‌రెడ్డి పాలనలో 80 వేల ఉద్యోగాలను ఇచ్చామని, వచ్చే మూడేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయని, వాటిని తీసుకున్న వారు తమ పంట పొలాలవద్ద పిట్టలు రాకుండా బెదురు కోసం చుట్టూరా కట్టారని, నేడు ప్రజాప్రభుత్వం అందిస్తున్న చీరలు బాగున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.


