ఎస్‌ఐ దౌర్జన్యం

SI Attack on Young man in Guntur - Sakshi

యువకుడిపై  విచక్షణారహితంగా దాడి

తలను గోడకేసి కొట్టడంతో కుట్లుపడిన వైనం

తాడేపల్లి ఎస్‌ఐ నిర్వాకం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

గుంటూరు, తాడేపల్లిరూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు మీద ఆడుకుంటున్న ఓ బాలుడిని ఢీకొట్టాడు. అయితే బాలుడితో సంబంధం లేని వ్యక్తులు ఆ యువకుడిపై దాడి చేసి చితకబాదగా, అనంతరం ఆ యువకుడి స్నేహితులు వారిని చితకబాదారు. అయితే యువకుడి స్నేహితులు కొట్టిన వారు మున్సిపల్‌ శానిటరీ ఉద్యోగులు కావడంతో, మున్సిపల్‌ కార్యాలయం నుంచి కార్మిక వర్గాలు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఆ యువకుడిని స్టేషన్‌కు పిలిపించి, విచక్షణా రహితంగా కొట్టి, తలను గోడకేసి బాదడంతో యువకుడి తల పగిలి మూడు కుట్లు పడ్డ సంఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఎస్‌.కె.మస్తాన్‌ తెలిపిన వివరాల ప్రకారం... నులకపేటలో ఈ నెల 15న మస్తాన్‌ ద్విచక్రవాహనంపై వెళ్తూ పొరపాటున రోడ్డుపై ఓ బాలుడిని ఢీకొన్నాడు. వారి తల్లిదండ్రులతో ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ఆటో మాట్లాడుతుండగా, అక్కడే పనిచేస్తున్న కొంతమంది మున్సిపల్‌ కార్మికులు అతనిపై దురుసుగా ప్రవర్తించారు. మస్తాన్‌కు మున్సిపల్‌ కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగి మున్సిపల్‌ కార్మికులు అతనిపై దాడి చేశారు.

ఈ విషయం తెలిసి మస్తాన్‌ స్నేహితులు వచ్చి మున్సిపల్‌ కార్మికులను కొట్టారు. దీంతో మున్సిపల్‌ కార్మికులు సోమవారం సాయంత్రం మస్తాన్, అతని స్నేహితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి ఎస్‌ఐ మస్తాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి బెల్టుతో అరచేతులపై కొట్టారు. మంగళవారం ఉదయం మళ్లీ పిలిపించి, కింద కూర్చోబెట్టి ఒకరు కాళ్లను నొక్కి పట్టుకుని కర్రతో బాదారు. అంతటితో ఆగకుండా ఎస్‌ఐ జుట్టు పట్టుకొని తలను గోడకేసి బాదారు. దాంతో తనకు తలపై మూడు కుట్లు పడ్డాయని బాధితుడు మస్తాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తన బంధువులు వెళ్లి ఎస్‌ఐను ప్రశ్నించగా మీకు చేతనైంది చేసుకోండి అని చెప్పినట్లు మస్తాన్‌ బంధువులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top