
శింగనమల: వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాయలసీమ కో–ఆర్డినేటర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తరిమెల శరత్‌చంద్రారెడ్డి(63) గుండెపోటుతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో గురువారం మృతి చెందారు. ఈనెల 12న ఆయనకు గుండెనొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించగా స్టెంట్ వేశారు. ఆ తర్వాత వెన్నెముక సమస్య తలెత్తడంతో బుధవారం కిమ్స్‌లో చేరారు. గురువారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. తరిమెల శరత్‌చంద్రారెడ్డి కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే తరిమెల రంగారెడ్డి రెండో కుమారుడు. శరత్‌చంద్రారెడ్డి తొలుత 2009లో టీడీపీలో చేరి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2014 వరకు అదే పార్టీలో ఉన్నారు.
ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. ప్రసుత్తం రాయలసీమ రైతు విభాగం కో–ఆర్డినేటర్‌గా ఉన్నారు. రైతు సంఘాల సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఆయన రైతు సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. భూగర్భజలం తగ్గిపోతోందని అందోళన చేశారు. ఈ విషయమై జైలు జీవితం గడిపారు. ఆయనకు భార్య, కుమారుడు వంశీగోకుల్‌రెడ్డి, కుమార్తె గాయత్రి ఉన్నారు. శింగనమలలో విషాదఛాయలు.. తరిమెల శరత్‌చంద్రారెడ్డి మృతితో శింగనమల మండలంలో విషాదం అలుముకుంది. శనివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.