సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు రెండో రోజూ సమ్మె కొనసాగించారు. అన్ని శాఖల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు.
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు రెండో రోజూ సమ్మె కొనసాగించారు. అన్ని శాఖల్లో ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. 92శాతం మంది సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్టు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం తెలిపింది. అదనపు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు వంటి ఉన్నతాధికారులు సైతం నిరసనల్లో పాలుపంచుకున్నారని ఫోరం కార్యదర్శి కేవీ కృష్ణయ్య చెప్పారు. మరోవైపు సచివాలయంలో ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు బుధవారం సచివాలయంలోని వేరు, వేరు ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు తెలిపారు.
ర్యాలీలు చేయరాదన్న సీఎస్ ఆదేశాల మేరకు నిర్దిష్ట ప్రాంతంలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కె బ్లాకు వద్ద తెలంగాణ ఉద్యోగులు, ఓల్డ్ మెయిన్ గేట్ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు బైఠాయించారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఉద్యోగులు వెనక్కి నడిచారు. హైదరాబాద్ రాష్ట్రం తెలుగువారందరిదని నినదించారు. 7 తేదీ హైదరాబాద్‌లో జరగనున్న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణవాదుల సభలు, సాగరహారం కార్యక్రమానికి ప్రభుత్వంతో మాట్లాడి మరీ అనుమతి ఇప్పించిన మంత్రి జానారెడ్డి సమైక్యవాదుల సభకు వ్యతిరేకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ ఉద్యోగుల ఆందోళన విరమణ
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కొన్ని రోజులుగా సచివాలయంలో నిరసనలు తెలుపుతున్న తెలంగాణ ఉద్యోగులు తమ ఆందోళనలు విరమిస్తున్నట్టు ప్రకటించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులందరూ అధిక గంటలు పనిచేసి ప్రభుత్వ పథకాలు, కార్యకలాపాలు సజావుగా సాగేలా చేస్తామని సచివాలయ తెలంగాణ సమన్వయ సంఘం కన్వీనర్ నరేందర్‌రావు తెలిపారు. సీమాంధ్ర ఉన్నతోద్యోగులు ఉద్యోగుల రిజిస్టర్లను తమ వద్ద ఉంచుకుని విధుల్లో పాల్గొనే వారిని బలవంతంగా సమ్మెలోకి దించుతున్నారని ఆరోపించారు.