విధులు మరచి.. ‘పచ్చ’ సేవలో తరించి.. | Secretariat Employee Negligence on Duty Anantapur | Sakshi
Sakshi News home page

విధులు మరచి.. ‘పచ్చ’ సేవలో తరించి..

Feb 25 2020 12:43 PM | Updated on Feb 25 2020 12:43 PM

Secretariat Employee Negligence on Duty Anantapur - Sakshi

టీడీపీ నాయకులకు కేక్‌ తినిపిస్తూ...

అనంతపురం, చెన్నేకొత్తపల్లి: సచివాలయ ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాన్ని కాలరాశాడు. తనొక ఉద్యోగినన్న విచక్షణ మరచి రాజకీయ పార్టీ పంచన చేరి కార్యకర్తలా మారిపోయాడు. ఎవరేమి అనుకుంటే తనకేమి అంటూ ‘పచ్చ’ కార్యకర్తలా చెలరేగిపోతున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌ బసంపల్లి సచివాలయంలో జూనియర్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అయితే అశోక్‌కుమార్‌ మాజీ మంత్రి పరిటాల సునీతకు మద్దతుగా టీడీపీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటూ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నాడు. జనవరిలో చెన్నేకొత్తపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర వర్ధంతికి హాజరై నివాళులర్పించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. గ్రామస్తులను సైతం టీడీపీ కార్యక్రమాల్లో హాజరు కావాలంటూ ప్రోత్సహిస్తున్నాడు. విధులు నిర్వహించే బసంపల్లి పంచాయతీ కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం సైతంనిర్వహిస్తున్నాడు.

♦ ఈ నెల 29న జరగనున్న మాజీ మంత్రి పరిటాల సునీత రెండో కుమారుడి వివాహానికి రావాలంటూ టీడీపీ నాయకులతో కలిసి ఆహ్వానపత్రికలు పంచుతూ విధులకు పూర్తిగా ఎగనామం పెడుతున్నాడు. బసంపల్లిలో సచివాలయం ప్రారంభం కాకపోవడంతో సదరు ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అశోక్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయమై చెన్నేకొత్తపల్లి ఎంపీడీవో సోనీబాయిని వివరణ కోరగా సచివాలయ ఉద్యోగి అశోక్‌కుమార్‌ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఏ సచివాలయ ఉద్యోగి కూడా రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. సదరు ఉద్యోగిపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మాజీ మంత్రి కుమారుడి పెళ్లి పత్రికలు పంచుతున్న అశోక్‌కుమార్‌ (వృత్తంలోని వ్యక్తి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement