ప్రాణం తీసిన పాఠశాల బస్సు

School Student Died in Private School Bus Accident Anantapur - Sakshi

సాయి విక్టరీ స్కూలు బస్సు కింద పడి విద్యార్థి మృతి

క్లీనర్‌ లేకుండా బస్సును పంపిన యాజమాన్యం  

చిగిచెర్ల వద్ద ఘటన..కన్నీరుమున్నీరైన విద్యార్థి తల్లిదండ్రులు

అనంతపురం, ధర్మవరం రూరల్‌: ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. డ్రైవర్‌ గమనించకుండా ముందుకెళ్లడంతో వెనుకచక్రాల కిందపడి ఎల్‌కేజీ విద్యార్థి ప్రాణం విడిచాడు. క్లీనర్‌ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చిగిచెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దవాడైన కుమారుడు శ్రీపాద చరణ్‌రెడ్డి (4)ధర్మవరంలోని గాంధీనగర్‌లో ఉన్న సాయి విక్టరీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఈ స్కూలుకు చిగిచెర్ల, చింతలపల్లి, వసంతపురం, గరుడంపల్లి తదితర గ్రామాల నుంచి విద్యార్థులు బస్సులో వెళ్లి వస్తుంటారు. అందులో భాగంగా సోమవారం సాయంత్రం స్కూలు వదలగానే విద్యార్థులను స్వస్థలాలకు వదిలిరావడానికి బస్సు బయల్దేరింది. చిగిచెర్లలో విద్యార్థులను దించిన డ్రైవర్‌ మరో వీధి వైపునకు బస్సును తిప్పుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే బస్సుకు వెనుకవైపున్న శ్రీపాద చరణ్‌రెడ్డిపై వెనుకచక్రాలు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్‌ ఎస్‌ఐ నగేష్‌బాబు గ్రామానికి చేరుకొని, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ నాగరాజును అదుపులోకి తీసుకుని, పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

క్లీనర్‌ లేకుండా బస్సును పంపారు..
విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేర్చాల్సిన పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ప్రదర్శించింది. క్లీనర్‌ స్థానంలో పీఈటీని బస్సులో పంపారు. అయితే ఆ పీఈటీ సెల్‌ఫోన్‌ను చూసుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగిపోయిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లీనర్‌ను పంపి ఉంటే బాలుడు బతికి ఉండేవాడని అన్నారు. బాలుడి మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top