రోడ్డు ప్రమాదంలో ఓ సేల్స్‌మన్ దుర్మరణం చెందగా మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి.
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో ఓ సేల్స్‌మన్ దుర్మరణం చెందగా మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గండిగూడ సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పాత బస్తీ తలాబ్‌కట్టకు చెందిన రజీయుద్దీన్ జుబేర్(23), మునావర్ అలీ(16)లు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గాకు బైకుపై వెళ్లారు.
సాయంత్రం తిరుగు ప్రయాణంలో గండిగూడ సమీపంలోకి రాగానే వీరి బైకును ఆటో ఢీకొంది. ప్రమాదంలో జుబేర్‌కు తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలైన అలీని శంషాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జుబేర్ నగరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తుండేవాడని తెలిసింది. ఇతనికి భార్య ఉంది. గాయపడ్డ అలీ పదో తరగతి చదువుతున్నాడు. జుబేర్ మృతదేహాన్ని స్థానిక క్లష్టర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈమేరకు శంషాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.