‘సదావర్తి’ సంచలనం | Sadavarti almshouse widespread criticism bhudanda | Sakshi
Sakshi News home page

‘సదావర్తి’ సంచలనం

May 29 2016 12:55 AM | Updated on Sep 17 2018 5:36 PM

‘సదావర్తి’ సంచలనం - Sakshi

‘సదావర్తి’ సంచలనం

సదావర్తి సత్రం భూ దందాపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సదావర్తి సత్రం భూదందాపై సర్వత్రా విమర్శలు
వేలం నిర్వహణపై సత్రం చైర్మన్ అసంతృప్తి
మండిపడుతున్న రాజకీయ పార్టీలు, ధార్మిక సంఘాలు

 
సదావర్తి సత్రం భూ దందాపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రజా, ధార్మిక , బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు ఏకంగా దేవస్థానం, సత్రాల భూములకే ఎసరు పెట్టడంపై మండి పడుతున్నారు. రూ.కోట్లు ఖరీదు చేసే భూమిని అతి తక్కువ ధరకే కొల్లగొట్టేశారు. టీడీపీ నేతలు బరితెగించి సత్రం ఆస్తులను దోచుకోవడంపై ధ్వజమెత్తుతున్నారు.
 
 
సాక్షి, విజయవాడ : అమరావతి సదావర్తి సత్రంలో ‘వెయ్యి కోట్ల లూటీ.. శీర్షికతో శనివారం ‘సాక్షి’ మెయిన్ మొదటి పేజీలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై తీవ్ర స్పందనలు వెల్లువెత్తాయి. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పక్కా స్కెచ్‌తో సాగిన అడ్డగోలు భూలూటీకి అధికార పార్టీ మంత్రులు సహకారం అందిచటంతో రూ.కోట్లు ఖరీదు చేసే భూమిని రూ.లక్షలకే దక్కించుకున్నారు.

దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. మరోవైపు ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో జిల్లాలో ఇంటిలిజెన్స్ అధికారులు రంగంలో దిగి అసలు సత్రం వ్యవహారంపై విచారణ సాగించారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు వారసుడు, సదావర్తి సత్రం చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ వేలం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకోవైపు సాక్షి కథనం నంబూరులో కలకలం సృష్టించింది. నంబూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి భూములను కొనుగోలు చేయడంతో వ్యవహారం కలకలం రేపింది.

భూముల కొనుగోలుపై సర్వత్రా చర్చ
నంబూరు గ్రామానికి చెందిన సంజీవరెడ్డి మంగళగిరి నూతక్కిలో స్థిరపడ్డారు. ట్రాక్టర్ వ్యాపారం చేసే సంజీవరెడ్డి రూ.22 కోట్లు పెట్టి సదావర్తి సత్రం భూములు కొనుగోలు చేయడం వెనుక మతలబుపై సర్వత్ర చర్చ సాగుతోంది. తెలుగుదేశం నేతల అనుచరుడుగా ఉన్న సంజీవరెడ్డి బినామీయేనని, తెరవెనుక కాపు కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఇంటిలిజెన్స్ వర్గాలు సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నాయి. ఇంకోవైపు అమరావతి దేవస్థానంలో తీవ్ర అలజడి రేగింది. దేవస్థాన అధికారులు గతంలో నిర్వహించిన వేలం ప్రక్రియకు సంబంధించి వీడియోతో సహా అన్ని ఆధారాలు సిద్ధం చేసుకుంటున్నారు.
 
దేవుడి స్థలాల జోలికొస్తే పతనం తప్పదు
భక్తి భావం ఉందని పదే పదే చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భూముల వేలంపై సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. దేవాదాయ శాఖ భూములను అమరేశ్వరస్వామి, ఆలయం పరిధిలోనే ఉండేలా భూములను స్వాధీనం చేసి గుడికి అప్పగించాలి. దేవుడి స్థలాల జోలికి వస్తే వారి పతనం తప్పదు. హిందూ సంస్థలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. వేలం నిర్వహించినప్పుడు తమిళనాడులో డబ్బులు ఉన్న నేతలు వాపారస్తులు లేరా? కేవలం టీడీపీ నేతలు మాత్రమే వేలంలో పాల్గొనేలా అధికారులు వారికి వత్తాసు పలికారు. - దర్శనపు శ్రీనివాస్, హిందూ ధర్మ, రక్షా సమితి జిల్లా అధ్యక్షుడు
 
వేలం దారుణం
సదావర్తి సత్రం భూముల అక్రమ వేలం దారుణం. ధార్మిక కార్యక్రమాల కోసం, హిందు ధర్మ పరిరక్షణ కోసం దాతలు మంచి ఉద్దేశంతో ఇచ్చిన భూముల్ని ఇలా అమ్ముకోవడం దారుణం. రూ.కోట్లు విలువ చేసే భూముల్ని రూ.లక్షలకు ఎలా వియ్రిస్తారు. దీనిపై న్యాయ విచారణ జరపాలి.   - దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు స్వామి కమలానంద భారతీ స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement