నీటి తీరువా రూ.108 కోట్లు లెక్కలేవి? | Rs 108 crore to organize countless water? | Sakshi
Sakshi News home page

నీటి తీరువా రూ.108 కోట్లు లెక్కలేవి?

Nov 25 2013 3:54 AM | Updated on Sep 2 2017 12:57 AM

ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టు రైతుల నుంచి వసూలు చేసిన నీటి తీరువాకు సంబంధించిన లెక్కలపై అస్పష్టత నెలకొంది.

ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టు రైతుల నుంచి వసూలు చేసిన నీటి తీరువాకు సంబంధించిన లెక్కలపై అస్పష్టత నెలకొంది. రైతుల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి జమ కడుతున్నామని రెవెన్యూ అధికారులు అంటుండగా.. ఎంత జమ చేశారో చెప్పాలని ఎస్సారెస్పీ అధికారులు ప్రశ్నిస్తే మాత్రం సమాధానం రావడం లేదు. రెండు శాఖల సమన్వయ లోపంతో తొమ్మిది పంటలకు సంబంధించిన రూ.108 కోట్లు లెక్కతేలకుండా పోయాయి.
 - న్యూస్‌లైన్, జగిత్యాల         
 
 జగిత్యాల, న్యూస్‌లైన్: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో పంటలకు సాగునీరు అందుతుంది. కాకతీయ కాలువ ద్వారా నిజామాబాద్, కరీంనగర్‌కు, సరస్వతీ కాలువ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, ఎల్‌ఎండీ నుంచి దిగువ కాకతీయ కాలువ ద్వారా వరంగల్ జిల్లాకు సాగునీరు సరఫరా అవుతుంది. ఎల్‌ఎండీ ఎగువ వరకు 4.50 లక్షల ఎకరాలు, ఎల్‌ఎండీ దిగువకు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ మొత్తంగా 5-6 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. సాగునీరు సరఫరా చేస్తున్నందుకు ఒక్కో సీజన్‌లో ఎకరానికి రూ.200 పన్ను(తీరువా) వసూలు చేస్తారు.
 
 ప్రాజెక్టు నిండితే రెండు పంటలకు, నిండకుంటే ఒక పంటకు, పూర్తిగా నిండకపోతే తాగునీటికి సరఫరా చేస్తారు. నీటి తీరువాను రెవెన్యూ యంత్రాంగం వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తుంది. ఈ డబ్బులు జమ చేసినట్లుగా రెవెన్యూ శాఖ వారు ఎస్సారెస్పీ అధికారులకు లేఖ ఇవ్వాలి. ఈ డబ్బును ప్రాజెక్టు అధికారులు ప్రభుత్వం నుంచి తీసుకుని అవసరమైన పనుల నిర్వహణకు, నీటి సంఘాల పరిధిలోని పనులకు వినియోగిస్తారు. జమ కట్టిన మొత్తంపై రెవెన్యూ శాఖ నుంచి ఎస్సారెస్పీ అధికారులకు ఎలాంటి లేఖలు రాకపోవడంతో ఈ డబ్బు ఎంత జమైందన్నది తేలడం లేదు.
 
 సమన్వయలోపం
 రెవెన్యూ, ప్రాజెక్టు యంత్రాంగం కలిసి పంటల సాగు రికార్డులు తయారు చేస్తున్నారు. అనంతరం రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేసి, ప్రభుత్వానికి చెల్లించి, ఎస్సారెస్పీ అధికారులకు లేఖ రాయాల్సిన రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ఎస్సారెస్పీ అధికారులు రెవెన్యూ శాఖను అడగడం లేదు. రెండు శాఖల సమన్వయ లోపంతో ఈ నిధులు ఏమయ్యాయో తెలియడం లేదు. నీటి తీరువా కింద జమ చేసిన మొత్తాన్ని రెవెన్యూ శాఖకు చాలన్ ద్వారా చెల్లిస్తామని తహశీల్దార్లు చెబుతున్నారు. కానీ, ఎంత జమ కట్టారో ఎస్సారెస్పీ అధికారులకు మాత్రం వెల్లడించడం లేదు. ఆర్డీవోల స్థాయిలో ఎస్సారెస్పీ అధికారులకు పన్ను వసూలు గురించి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా స్పందించడం లేదు.     
 
 ఎన్నిసార్లు అడిగినా సమాచారం లేదు..
 నీటి తీరువా కింద ఎన్ని నిధులు వచ్చాయని ఎన్నిమార్లు అడిగినా రెవెన్యూ అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఎస్సారెస్పీ కింది మరమ్మతుల కోసం పంపించే ప్రతిపాదనలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ప్రభుత్వం నుంచి కాడాకు అక్కడి నుంచి మాకు నిధులు రావడం లేదు. మరమ్మతు పనులు చేయకపోవడంతో నీటి సరఫరా ఇబ్బందిగా మారుతోంది. ఆయకట్టు చివరి ప్రాంతాలకు సాగునీరు అందించడం కష్టంగా మారింది.
 - శ్రీశైలం, ఈఈ, ఎస్సారెస్పీ, జగిత్యాల
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement