ప్రభుత్వం చేజారిన సర్కారు జాగా
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి బంజారాహిల్స్‌లోని రూ.250 కోట్ల విలువైన స్థలం
ఇప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్లని రెవెన్యూ అధికారులు
సాక్షి,హైదరాబాద్ : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కోట్లా ది రూపాయల విలువ చేసే సర్కార్ భూమికి ఎసరు పెడుతోంది. సర్కారు జాగా ప్రైవేట్‌పరం కావడానికి సిద్ధంగా ఉంది. సర్కారు మేల్కోకపోతే ఈ ఖరీదైన స్థలం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి జారుకునే అవకాశం ఉంది. ఈ స్థలం విలువ రూ.250 కోట్లు ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే... షేక్ పేట మండలం బంజారాహిల్స్ రోడ్ నెం.2 సాగర్ సొసైటీ చౌరస్తాలో సర్వే నెం. 129/71, 144(ఓల్డ్ అండ్ న్యూ)లో 7,500 గజాల ప్రభుత్వ స్థలం 60 ఏళ్ల నుంచి రెవెన్యూ కస్టడీలో ఉంది. ఇందులో ప్రభుత్వ స్థలం అనే హెచ్చరిక బోర్డు కూడా ఉండేది.
అయితే ఈ స్థలం తనదేనంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల రిట్ అప్పీల్ మీద తీర్పు వచ్చింది. అయూబ్ అనే వ్యక్తికి సంబంధించి జీపీఏ హోల్డర్ ఈ స్థలం తనదేనంటూ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై రెవెన్యూ అధికారులు సరైన ఆధారాలు సమర్పించకపోవడం, వాదనలు సరిగ్గా వినిపించకపోవడంతో ఈ స్థలాన్ని సదరు వ్యక్తి క్లయిమ్ చేస్తున్నారు. సర్వే రిపోర్ట్ తప్పుగా ఉండటం వల్లే ఈ స్థలం ప్రభుత్వం నుంచి చేజారిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత 60 ఏళ్లుగా ప్రభుత్వ ఆదీనంలో ఉన్న ఈ ఖరీదైన స్థలం ప్రైవేట్ వ్యక్తుల పరం అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో రెవెన్యూ అధికారులు రిట్ పిటిషన్ అప్పీల్ చేయలేదు. దీంతో ఈ స్థలంలో హెచ్చరిక బోర్డులు కూడా కొంతమంది తొలగించారు.
ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశాం..
సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న 7,500 గజాల స్థలానికి సంబంధించి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని జీపీతోపాటు ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశాం. హైకోర్టు ఈ స్థలంపై సర్వే జరపాలని తీర్పునివ్వగా, దీనిపై సుప్రీంకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాం. వాస్తవానికి ఈ స్థలాన్ని డిప్యూటీ డైరెక్టర్ సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ మీదనే ఇప్పటికీ తాము నిలబడుతున్నాం. మరోసారి సర్వే జరపాల్సిన అవసరం లేదు. అయితే ఈ స్థలంపై సుప్రీం కోర్టుకు ఎస్‌పీఎల్(స్పెషల్ లీవ్ పిటిషన్) వేయబోతున్నారు. – అనితారెడ్డి, షేక్‌పేట తహíసీల్దార్


