మిస్‌ సైబీరా.. ఓ ఫిర్యాదుల స్వీకర్త

Robo CYBIRA To Receive Complaints At The Police Station - Sakshi

నగర పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్త అధికారి!!

అదే రోబో.. మిస్‌ సైబీరా

ఫిర్యాదుల స్వీకరణకు దీని సేవలు

మహారాణిపేట పీఎస్‌లో ప్రారంభించిన సీపీ ఆర్కే మీనా 

అల్లిపురం(విశాఖ దక్షిణం): బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించే రోబోను ప్రయోగాత్మకంగా మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌.కె.మీనా దీనిని ప్రారంభించారు. నగరానికి చెందిన రోబో కప్లర్‌ సంస్థ మిస్‌ సైబీరా రోబోటిక్‌ను తయారు చేసింది. సంస్థ సీఈవో మళ్ల ప్రవీణ్‌ రోబో పనితీరును కమిషనర్‌కు వివరించారు. దేశంలో మొదటి సారిగా విశాఖ పోలీసులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ రోబోను ప్రారంభించిన వెంటనే రోబో సెల్యూట్‌ చేసింది.

మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుంది..
రోబోను మరింత అభివృద్ధి చేస్తే మంచి సేవలను పొందవచ్చని సీపీ ఆర్‌.కె.మీనా అభిప్రాయపడ్డారు. నగరంలో జేబుదొంగలు, రౌడీ షీటర్లు, దోపిడీదారుల ఫొటోలను సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ చేసి, వారి కదలికలను సంబంధిత అధికారులకు చేరవేసేలా ఉంటే ప్రయోజనం ఉంటుందని ఆయన సంస్థ ప్రతినిధులకు తెలిపారు. ఆమేరకు సాప్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఎక్కువగా ఫిర్యాదులు వచ్చే కంచరపాలెం, పీఎంపాలెం, ఫోర్తు టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వీటిని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలన్నారు.

 

రూ.8.7 లక్షలు ఖర్చు అయ్యింది..
మిస్‌.సైబీరా రోబోటిక్‌ తయారీకి రూ.8.7లక్షలు ఖర్చు అయ్యింది. ఎక్కువ మొత్తంలో తయారు చేస్తే రూ.4 నుంచి రూ.5లక్షలకు తయారవుతుంది. ఇప్పటికే ఇందులో 129 అప్లికేషన్లు లోడ్‌ చేశాం. ఇంకా 20 వరకు అప్లికేషన్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. సైబీరా పనితీరును పరిశీలించిన తరువాత దీంట్లో లోపాలను సరిచేసి పూర్తి స్థాయిలో రూపొందించి అందుబాటులోకి తీసుకుస్తాం.
–మల్ల పవన్, సీఈఓ, రోబో కప్లర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top