కరువు సీమలో హరిత సంతకం..

Rayachoti MLA G. Srikanth Reddy Convened assembly to Give Krishna Water to Veliyalu Project - Sakshi

సాక్షి, కడప : కరువు రక్కసి కాటేసిన తెలుగు నేలపై ఆయనో హరిత సంతకం. బీడు వారిన నేలతల్లికి జలసిరులందించిన భగీరథ రూపం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జలయజ్ఞం ప్రారంభించి, ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఇందులో మొదటిది వెలిగల్లు ప్రాజెక్టు. ఆయన మరణానంతరం పాలకుల నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దీంతో పై ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు నీరు రావడం గగనమైంది. ‘ఆయనే ఉండి ఉంటే’ అంటూ ఆ మహానేత పాలనను నేటికీ జనం నిత్యం స్మరించుకుంటున్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలని వారు కోరుతున్నారు. ఇది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పేర్కొంటున్నారు.

అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే
వందల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులోకి ఏళ్లు గడుస్తున్నా నీరు సరిపడినంత రాకపోవడంతో.. కృష్ణా జలాలను ప్రాజెక్టుకు అందివ్వాలని రాయచోటి ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గళమెత్తారు. ప్రాజెక్టు పైభాగం నుంచి జిల్లాలోకి ప్రవేశించి.. చిత్తూరు జిల్లాకు వెళ్లనున్న హంద్రీ–నీవా నీటిని ప్రాజెక్టుకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ఇదే విషయంపై రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కరువు ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టులకు కృష్ణా జలాలను అందివ్వాలని సూచిస్తూనే.. వెలిగల్లు ప్రాజెక్టుకు కూడా 3 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వీరి వాదనలపై అతిగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తర్వాత కాలంలో చెప్పిన మాటలను గాలికొదిలేశారు.

రాయచోటి : ఎడారిని తలపించే రాయచోటి ప్రాంతంలో జలయజ్ఞంలో భాగంగా తొలి ప్రాజెక్టు వెలిగల్లును దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్మించారు. దీనిని 2008లో ఆయన ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. సాగు నీరు లేక వర్షాధార వ్యవసాయంతోనే  బతుకుతున్న రైతన్నలకు ఈ ప్రాజెక్టు.. కొండంత ఆశలు రేకెత్తించింది. 4.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన నాటి నుంచి నేటి వరకు నీటితో కళకళలాడకపోయినా.. అడుగు భాగంలో ఉన్న 0.7 టీఎంసీల నీరు ఆ ప్రాంతంలో భూగర్భజలాల పెంపుదలకు దోహదం చేస్తోంది. 

ఎప్పటి నుంచో ..
కడప–అనంతపురం–చిత్తూరు జిల్లాల సరిహద్దులో వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై ప్రాజెక్టును నిర్మించాలని బ్రిటీష్‌ ఇంజినీర్లు నిర్ణయించారు. నాటి నుంచి అదిగో, ఇదిగో ప్రాజెక్టు అంటూ హామీల మీద హామీలు గుప్పిస్తూ వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో ప్రాజెక్టు నిర్మాణానికి రెండు పర్యాయాలు నాంది పలికినా.. ముందుకు సాగలేదు. 2003లో స్థానిక ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికలు మరో ఏడాదిలో ఉండటంతో తూతూమంత్రంగా 10 కోట్ల రూపాయలు కేటాయించి శంకుస్థాపనతో సరిపెట్టుకున్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో నడుస్తున్న పనులను చూసి మరెన్ని దశాబ్దాలకు ప్రాజెక్టు పూర్తవుతుందోనన్న అనుమానాలు.. అసలు ప్రాజెక్టు పూర్తవుతుందా అన్న బెంగ నెలకొని ఉండేది. కారణం కొన్ని దశాబ్దాల క్రితం వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించాలని తలచినా.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం, వ్యవసాయం దండగ అన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు ఈ ప్రాంత రైతులు ఆశలను వదులుకునేలా చేసింది.

వీటికి తోడు శంకుస్థాపన చేసి పనులు చేపట్టలేదంటూ  2003లో ప్రతిపక్ష నాయకుని హోదాలో వైఎస్సార్‌ శిలాఫలకం వద్ద మొక్కలు కూడా నాటారు. ఇలాంటి తరుణంలో 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీఎం అయ్యారు. ఆయన హయాంలో నిధులు వరదలా పారడంతో 2008లోనే పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి  ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మహానేత హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులలో పూర్తయిన మొదటి ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది. 

ప్రాజెక్టు పూర్తితో రైతులలో ఆనందం
దశాబ్దాల కల రైతుల కళ్లెదుట కనిపించేలా చేసి.. ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీరు బయటకు వదలడంతో గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాల పరిధిలోని రైతులలో ఆనందం నెలకొంది. ప్రాజెక్టులోకి నీరు సమృద్ధిగా చేరితే రాయచోటి నియోజకవర్గ పరిధిలోని గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందడంతోపాటు వేలాది ఎకరాల సాగుకు అనువుగా భూగర్భ జలాలు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయితే వర్షం ఎప్పుడు కురిసి నీరు వచ్చినా పంటలను సాగు చేసుకోవచ్చన్న సంతోషం రైతుల్లో కనిపించింది. ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాల్వల కింద 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు 60 కిలోమీటర్ల మేర కాలువలను తవ్వారు.
 

రాయచోటికి తాగునీరు
తాగునీటి కోసం పరితపించే రాయచోటి పట్టణ ప్రజలకు వెలిగల్లు ప్రాజెక్టు ఓ వరంలా మారింది. దశాబ్దాల కాలం నుంచి తాగునీటితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. వైఎస్సార్‌ హయాంలో 48 కోట్ల రూపాయలను మంజూరు చేసి 30 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు చేశారు. దీంతో రాయచోటి పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.

చెరువులకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే
ప్రాజెక్టులోకి తగినంత నీరు రాకపోవడంతో ఉన్న నీటిని చెరువులకు అందించి భూగర్భ జలాలను పెంచాలన్న ఆలోచనతో స్థానిక ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి రెండు పర్యాయాలు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. పొలాలకు అందించే నీరు చేరే అవకాశాలు లేక.. ప్రధాన కాల్వలకు నీరు వదిలి కొన్ని ప్రాంతాలలోని చెరువులు, కుంటలు నింపారు.

కృష్ణా జలాలతోనే మోక్షం
వెలిగల్లు ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు నీరందాలంటే కృష్ణా జలాలను తీసుకురావాల్సిందే. ప్రాజెక్టు పై భాగంలో మరో ప్రాజెక్టును నిర్మించడంతో వెలిగల్లుకు నీరు రావడం కష్టతరంగా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలంటే 5 టీఎంసీల నీరు అవసరం. అంత నీరు వచ్చే వర్షాలు ఈ ప్రాంతంలో కురవడం లేదు. ప్రాజెక్టును నిర్మించి 10 ఏళ్లు పూర్తవుతున్నా పెద్ద వర్షాలు రాలేదు. కాబట్టి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలతో ప్రాజెక్టును నింపాలి.
– ఎం.యదభూషణరెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు, గాలివీడు

జిల్లాపై బాబు అశ్రద్ధ
సీఎం చంద్రబాబుకు కడప జిల్లా రైతుల పట్ల ప్రేమ లేదు. వెలిగల్లు ప్రాజెక్టు నిర్మాణంలోనూ శ్రద్ధ చూపలేదు. పనులు పూర్తయిన తర్వాత నీరు లేదని.. కృష్ణా జలాలతో ప్రాజెక్టును నింపాలని పలుమార్లు ప్రాధేయపడ్డా పట్టించుకోలేదు. అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లి నుంచి నేరుగా కాలువల ద్వారా.. ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశాలు ఉన్నా నీటిని విడుదల చేయలేదు. అక్కడి నుంచి అనేక లిఫ్ట్‌ ఇరిగేషన్లతో తమిళనాడు సరిహద్దులో ఉన్న కుప్పానికి నీటిని తీసుకెళ్లారు. కరువు రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెలిగల్లు ప్రాజెక్టులోకి కృష్ణా నీటిని వదిలేవారు.
– జల్లా సుదర్శనరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, గాలివీడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top