కమీషన్ పెంచనిపక్షంలో నిరవధిక సమ్మె | Ration dealers warning to the government | Sakshi
Sakshi News home page

కమీషన్ పెంచనిపక్షంలో నిరవధిక సమ్మె

May 21 2015 5:43 AM | Updated on Sep 3 2017 2:27 AM

రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నెల వారీ ఖర్చులు పోనూ నెలకు 15 వేల రూపాయల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం...

చౌకడిపో డీలర్ల సంఘం హెచ్చరిక
 
గుంటూరు ఈస్ట్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నెల వారీ ఖర్చులు పోనూ నెలకు 15 వేల రూపాయల ఆదాయం వచ్చేలా ప్రభుత్వం కమీషన్‌ను ప్రకటించాలని లేని పక్షంలో నిరవధిక సమ్మె చేస్తామని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి లీలామాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా బుధవారం గుంటూరులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బియ్యం గోడౌన్ల వద్ద ఏర్పాటుచేసిన దీక్షా శిబిరాన్ని లీలామాధవరావు ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ డీలర్లు నెలకు 50 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి 1.30 కోట్ల మంది కార్డుదారులకు ప్రతినెలా సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. డీలర్లకు ఇస్తున్న కమీషన్ చాలక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గత 8 నెలలుగా తమ సమాఖ్య ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేసిందని చెప్పారు.తమ సమస్యలు పరిష్కరించనందుకు నిరసనగా ఈ నెల 25వ తేదీ వరకు డీడీలు చెల్లించకుండా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ నెల 25 వ తేదీ ప్రభుత్వంతో జరిపే చర్చలు సఫలం కాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి సి.హెచ్.వెంకట్రావు మాట్లాడుతూ డీలర్లకు సరఫరా చేస్తున్న బియ్యం 150 కిలోల వరకు తరుగు వస్తున్నదని, తమను మాత్రం కార్డుదారులకు తరుగు లేకుండా బియ్యం సరఫరా చేయమనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కార్యక్రమంలో కోశాధికారి గుంటూరు వెంకటేశ్వర్లు ,కిరోసిన్ హాకర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డి,రాజేశ్వరరావు,వెంకటేశ్వరరావు,సుభానీ,వివిధ మండలాలకు చెందిన డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement