
ఏప్రిల్ నుంచి కమీషన్ అందని వైనం
రాష్ట్రవ్యాప్తంగా రూ.115 కోట్లకుపైగా బకాయిలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆగస్టు వరకు పేదలకు పీడీఎస్ బియ్యం పంపిణీ చేసిన రేషన్ డీలర్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చినెల వరకే ప్రభుత్వం రేషన్ కమీషన్ అందజేసింది. ఏప్రిల్ నెల నుంచి ఇవ్వకపోగా, జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడంతో ఐదు నెలల కమీషన్ పెండింగ్‌లో ఉంది.
17,286 రేషన్ దుకాణాలు
రాష్ట్ర వ్యాప్తంగా 92 లక్షల ఆహార భద్రతాకార్డులు (రేషన్‌కార్డులు) ఉండగా, ఆయా కార్డుదారులకు 17,286 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1.70 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. క్వింటాల్‌కు రూ.140 చొప్పున ప్రభుత్వం డీలర్లకు చెల్లిస్తుంది. ఈ లెక్కన 1.70 లక్షల మెట్రిక్ టన్నులకు ప్రతి నెలా రూ.23 కోట్ల వరకు కమీషన్ కింద ఇస్తోంది. ఐదు నెలలకుగాను రూ.115కోట్ల వరకు డీలర్లకు చెల్లించాల్సి ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో డీలర్‌కు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు బకాయిలు రావాల్సి ఉండగా, జీహెచ్‌ఎంసీతోపాటు మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.లక్షకు పైగానే బకాయిలు ఉన్నాయి. ఇటీవల రేషన్ డీలర్ల కమీషన్ విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొక్కొండ వైకుంఠం పౌరసరఫరాల శాఖ సంయుక్త కమిషనర్ మనోహర్‌కుమార్ రాథోడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
కమీషన్‌ను రూ.140 నుంచి 300కు పెంచాలని డీలర్లు కోరుతున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కమీషన్ పెంపుపై హామీ ఇచ్చిoది. ప్రతి రేషన్ డీలర్‌కు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పింది. అయితే రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు.