తవ్వేకొద్దీ అవినీతి

Ration Dealers Committing Fraud In Distribution At Narasaraopeta - Sakshi

 సాక్షి, నరసరావుపేట( గుంటూరు): పట్టణంలో రేషన్‌ డీలర్ల  అక్రమాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. ఇప్పటికే అనేక రేషన్‌ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించి నిల్వల్లో తేడాలున్నట్లు గుర్తించారు. మరి కొందరు దుకాణదారులు బియ్యాన్ని నల్లబజారుకు తరలించి.. షాపులకు తాళాలు వేసుకుని పరారవుతున్నారు.  అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ఒక వైపు రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేసి అంతటా పారదర్శకత తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపడుతుంటే.. మరో వైపు కొందరు డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికారుల తనిఖీల్లో  రేషన్‌ డీలర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వెళ్లిన ప్రతి చౌకదుకాణంలో ఏదో ఒక లోపం కనిపిస్తుండటంతో అధికారులు విస్తుపోతున్నారు. సోమవారం రేషన్‌ షాపులపై దాడులు నిర్వహించిన పౌరసరఫరాల శాఖ అధికారులు వందల క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్లు పక్కదారి పట్టించడాన్ని గుర్తించారు. ఐదుగురు డీలర్‌లపై కేసులు నమోదు చేయటంతో పాటు క్రిమినల్‌ కేసులకు  సిఫారసు  చేశారు.

వివరాల్లోకి వెళ్లితే.. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని డీలర్లు గత కొన్నేళ్లుగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో అనేక మంది కార్డుదారులు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు ప్రభుత్వం మారటంతో చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల రొంపిచర్లలో అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డ రేషన్‌ బియ్యం నరసరావుపేట చౌకడిపోల నుంచి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఆర్డీవో కె. శ్రీనివాసరావు పట్టణంలోని అన్ని చౌకదుకాణాలను తనిఖీలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

కార్డుదారులకు పంపిణీ చేయగా ఉండాల్సిన నిల్వ రేషన్‌ బియ్యం, కందిపప్పు, పంచదార ఏ ఒక్క చౌకదుకాణంలో అందుబాటులో లేవు.  మరోవైపు అధికారులు తనిఖీలతో అక్రమార్కులు డిపోలకు తాళాలు వేసుకొని అజ్ఞాతంలోకి జారుకుంటున్నారు. తమ అవినీతి బండారం ఎక్కడ బయట పడుతుందోనని ఏ ఒక్క డీలర్‌ అధికారులకు సహకరించడం లేదు. 

ఐదు షాపులపై కేసులు : డీటీ 
నిమ్మతోటలోని 44వ నంబర్‌ చౌకదుకాణంపై అధికారులు ఆదివారం తనిఖీలు చేపట్టి 33 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పక్కదారి పట్టినట్టు గుర్తించారు. దీంతో సోమవారం మిగిలిన చౌక డిపోలను పరిశీలించేందుకు పౌరసరఫరాల శాఖ డీటీ అశోక్, వీఆర్వోలు పట్టణంలోని పలు దుకాణాలకు వెళ్లి స్టాక్‌ రిజష్టర్‌లను పరిశీలించారు. అక్కడ ఉండాల్సిన నిల్వల్లో భారీ వ్యత్యాసాన్ని గుర్తించారు.

 షాపు నంబర్‌ 12లో 37 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పంచదార, 2.8 క్వింటాళ్ల కంది పప్పు, అదే విధంగా షాపు నంబర్‌ 15లో 17.28 క్వింటాళ్ల బియ్యం, 31 కేజీల పంచదార, షాపు నంబర్‌ 16లో 40.4 క్వింటాళ్ల బియ్యం, 1.21 క్వింటాళ్ల పంచదార, షాపు నంబర్‌ 18లో 43.87 క్వింటాళ్ల బియ్యం, 1.14 క్వింటాళ్ల పంచదార వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. 19 నంబర్‌ షాపు రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని, సబంధిత డీలర్‌లపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు డీటీ తెలిపారు. 

క్రిమినల్‌ చర్యలకు సిఫారసు..
పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన డీలర్‌లపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసులకు సిఫారసు చేయనున్నట్లు డీటీ అశోక్‌ తెలిపారు. వందలాది క్వింటాళ్ల బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినట్ల విచారణలో తేలిందన్నారు. ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అరుగురు డీలర్‌లపై 6(ఎ) కేసు నమోదు చేసినట్లు వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top