
పుష్కర విషాదం
గోదావరి పుష్కర యాత్రల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యాత్రికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం, ....
రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి
16మందికి తీవ్రగాయాలు
మృతులు, క్షతగాత్రులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారు
గోదావరి పుష్కర యాత్రల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యాత్రికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం, రాత్రి వేళ ప్రయాణం దుర్ఘటనలకు దారితీస్తున్నాయి. సబ్బవరం మండలంలో రెండు వ్యాన్లు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్.రాయవరం మండలంలో కోనవానిపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. పుష్కరాల నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఎనిమిదికి తీవ్ర గాయాలయ్యాయి.
గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించాలన్న తపన.. ఈసారి తప్పితే మళ్లీ పన్నెండేళ్లకు గానీ అవకాశం రాదన్న ఆత్రుతలతో భక్తులు వరదలా పోటెత్తుతున్నారు.. ఏ వాహనం దొరికితే అందులో ప్రయాణిస్తున్నారు. ఈ తొందరపాటు, నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారాయి. ప్రైవేటు వాహనాల్లో రాత్రి ప్రయాణాలు ఉసురు తీస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు పుష్కర యాత్రికులు మృతి చెందగా పదహారుమంది తీవ్రగాయాల పాలయ్యారు. వీరంతా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారు.
సబ్బవరం : పుష్కర పుణ్యస్నానం ఆచరించి, తరించాలన్న వారి ఆశ నెరవేరలేదు. వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యుశకటమై కబళించింది. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమండ్రి వెళ్లేందుకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి మంగళవారం అర్ధరాత్రి టాటా మేజిక్ వ్యానులో 11మంది బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున ఈ వాహనాన్ని రాజమండ్రి పుష్కరాల నుంచి వస్తున్న మరో వ్యాన్ సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీ సున్నపుబట్టీల సమీపాన జాతీయ రహదారిపై ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నరసన్నపేట మండలం రాళ్లపాడు గ్రామానికి చెందిన బోర ఎర్రప్పడు (60), గార మండలం రెడ్డిపేట గ్రామస్తురాలు కర్రి సుభద్రమ్మ(40) అక్కడికక్కడే మరణించారు. జలుమూరు మండలం టెక్కలిపాడు గామానికి చెందిన పిట్టా అప్పలరాజు (25) తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన బోర సరస్వతి (44), కళ్యాణి మల్లేసు (60), కళ్యాణి అమ్మన్నమ్మ (40), కళ్యాణి లక్ష్మి (30), కర్ర సన్యాసిరావు (45), సిమ్మ పారయ్య(60), సిమ్మ రాములమ్మ (56), బొజ్జ లక్ష్మి (30) తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని విశాఖ కేజీహెచ్‌కి, మరో రెండు ప్రయివేటు ఆస్పత్రులకు అంబులెన్సుల్లో తరలించారు. ఎస్‌ఐ వి.చక్రధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుష్కర యాత్ర ముగించుకొని వస్తూ ఢీకొన్న వాహనంలో నరసన్నపేట మండలం ఈదల వలస గ్రామానికి యాత్రికులున్నారు. సంఘటన స్ధలంలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి.